June 11, 2026
Explore
జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి:

జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి:

June 11, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.అన్నమయ్య జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సోర్స్ కనెక్టివిటీ కల్పించడం, నీటి వనరుల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం మరియు బ్రీచ్ అయిన నీటి వనరుల పునరుద్ధరణ అంశాలపై గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన వాసర్ ల్యాబ్స్ నిపుణులు సమర్పించిన నివేదికలు, మ్యాపుల ఆధారంగా జిల్లాలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంపై విస్తృతంగా చర్చించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోర్స్ కనెక్టివిటీకి ఉన్న అవకాశాలను మ్యాపుల ద్వారా ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ముఖ్యంగా సోమల, కలికిరి, పెద్దమండ్యం మరియు ఇతర మండలాల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సమీప జలవనరుల ద్వారా అనుసంధానం కల్పించగల ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.

జిల్లాలో బ్రీచ్ అయిన చెరువులు, నీటి వనరులను పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎక్కడెక్కడ సోర్స్ కనెక్టివిటీ అవసరమో గుర్తించి, ఆయా పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

అందుబాటులో ఉన్న వివిధ నిధుల ద్వారా అత్యవసర పనులకు ఆమోదం తెలుపుతూ, పనులను త్వరితగతిన ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరులు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకట్రామయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: Source connectivity and tank restoration works in the district must be expedited.