June 10, 2026
Explore
పెళ్ళికి ముందు శారీరక సంబంధం చెడు నడవడిక కాదు.. . సుప్రీం కోర్టు

పెళ్ళికి ముందు శారీరక సంబంధం చెడు నడవడిక కాదు.. . సుప్రీం కోర్టు

June 10, 2026 | Andhra Pradesh

కానిస్టేబుల్ అభ్యర్థి నియామకానికి గ్రీన్ సిగ్నల్

అమరావతిముచ్చట్లు:

సమకాలీన సామాజిక పరిస్థితుల్లో ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో పెట్టుకునే వివాహేతర లేదా పెళ్ళికి ముందరి శారీరక సంబంధాలు వ్యక్తి యొక్క చెడు నడవడికకు లేదా దుశ్చరిత్రానికి నిదర్శనం కావని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో స్పష్టం చేసింది.

ప్రేమ విఫలమై, పరస్పర రాజీతో ముగిసిన క్రిమినల్ కేసును కారణం చూపి తెలంగాణకు చెందిన ఒక కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపికను రద్దు చేయడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియలో సదరు అభ్యర్థి అర్హతను పునఃపరిశీలించి, అతనికి పోలీస్ కానిస్టేబుల్‌గా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది.

తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి ‘స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్’ (SCTPC) పోస్టుకు తాత్కాలికంగా ఎంపికయ్యారు. అయితే, గతంలో అతనిపై పొరుగున ఉండే ఒక మహిళ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఐపీసీ సెక్షన్లు 417, 420, 506 కింద కేసు నమోదు చేసింది. దాదాపు నాలుగేళ్ల పాటు సాగిన వారి ప్రేమ సంబంధం వివాహానికి దారితీయకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. అయితే 2015లోనే లోక్ అదాలత్ వేదికగా ఇరుపక్షాలు పరస్పర రాజీకి రావడంతో ఆ కేసు వీగిపోయింది. అభ్యర్థి ఈ క్రిమినల్ కేసు వివరాలను తన అటెస్టేషన్ ఫామ్‌లో నిజాయితీగా వెల్లడించినప్పటికీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మాత్రం ఇది నైతిక పతనానికి (Moral Turpitude) సంబంధించిన వ్యవహారమని, క్రమశిక్షణతో కూడిన పోలీస్ ఉద్యోగానికి అతను అనర్హుడని పేర్కొంటూ అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి అభ్యర్థికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, డివిజన్ బెంచ్ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
​రాజీ పడటం అంటే నేరాన్ని ఒప్పుకున్నట్టు కాదు
నియామక బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. క్రిమినల్ కేసులో ఇరుపక్షాలు రాజీ పడ్డాయి అంటే, అభ్యర్థి తన నేరాన్ని అంగీకరించినట్లు భావించడం పూర్తిగా తార్కిక విరుద్ధమని, అసంబద్ధమని ధర్మాసనం పేర్కొంది. భారతీయ క్రిమినల్ న్యాయశాస్త్రం ప్రకారం కోర్టులో నేరం నిరూపించబడేంత వరకు ఏ వ్యక్తినైనా నిర్దోషిగానే పరిగణించాలని గుర్తు చేసింది.

ఈ కేసులో మోసం జరిగిందా లేదా అనేది కేవలం సదరు బాధితురాలి సాక్ష్యం ద్వారానే రుజువు కావాల్సి ఉంటుందని, కానీ ఆమె స్వచ్ఛందంగా కేసును ఉపసంహరించుకుని రాజీ పడినప్పుడు, అధికారులు సొంతంగా ఊహాగానాలకు తెరలేపి అభ్యర్థి క్యారెక్టర్‌పై బురదజల్లడం చట్టవిరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. బలవంతంగానో లేదా బెదిరింపులకు గురిచేసి వివాదాన్ని ముగించినట్లు ఎలాంటి ఆధారాలు లేనందున బోర్డు చర్య ఏకపక్షమని కోర్టు అభిప్రాయపడింది.

మారుతున్న ఆధునిక సామాజిక పరిస్థితుల పట్ల ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ సంస్థలు మరియు అధికారులు సున్నితంగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. ప్రస్తుత సమాజంలో ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో సంబంధాలు కలిగి ఉండటం సర్వసాధారణమని, ఏ చట్టమూ దీనిని నిషేధించలేదని స్పష్టం చేసింది. ప్రతి ప్రేమ లేదా శారీరక సంబంధం ఖచ్చితంగా పెళ్ళికి దారితీయాలనే నియమం లేదని, కేవలం సంబంధం విఫలమైనంత మాత్రాన ఒకరు మరొకరిని మోసం చేశారని ముద్ర వేయలేమని ధర్మాసనం వివరించింది. వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అపోహల ఆధారంగా కాకుండా, దేశ చట్టాలు మరియు రాజ్యాంగ పరిధిలోనే అభ్యర్థుల అర్హతను అంచనా వేయాలని స్పష్టం చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసి, సింగిల్ జడ్జి ఇచ్చిన నియామక ఆదేశాలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.

Tags: Premarital sexual relations do not constitute bad conduct… Supreme Court.