రూ.20.46 లక్షల విలువైన సరుకు పట్టివేత
కల్లూరు ముచ్చట్లు:
కల్లూరు పోలీసుల అప్రమత్తతతో భారీ ఎర్రచందనం అక్రమ రవాణా యత్నం భగ్నమైంది. ఈరోజు ఉదయం కల్లూరు ఎస్‌ఐకి అందిన ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు బీసీ కాలనీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
ఉదయం సుమారు 9 గంటల సమయంలో TS07 KC 5074 నంబర్ గల టయోటా ఇటియోస్ కారును తనిఖీ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, వాహన డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు వాహనాన్ని పరిశీలించగా అందులో 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను తూకం వేయగా వాటి మొత్తం బరువు 358 కిలోగ్రాములుగా తేలింది. ఎర్రచందనం విలువ సుమారు రూ.16,46,800 కాగా, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.20,46,800గా నిర్ధారించారు.
ఈ ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Tags: Huge quantity of red sandalwood seized in Kallur.