June 5, 2026
Explore
బాధిత హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ..

బాధిత హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ..

June 5, 2026 | Andhra Pradesh

💠చెక్కులు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

విధుల నిర్వహణలో అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు మరియు పదవీ విరమణ పొందిన హోంగార్డుకు అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులకు, విశ్రాంత హోంగార్డుకు పోలీస్ సంక్షేమ నిధుల చెక్కులను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యతని, వారి హోదా ఏదైనా పోలీస్ శాఖ ఒకే కుటుంబంలా భావించి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ (సీడబ్ల్యూఎఫ్) నుండి మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా దివంగత హోంగార్డులు ఎస్.వి. చలపతి భార్య వి. సరళ, ఆర్.వి. రమణ భార్య డి. తులసి, ఎం. వేణుగోపాల్ భార్య కె. చంద్రకళ, వై. పవన్ కుమార్ రెడ్డి తల్లి వై. రాధలకు ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున, అలాగే బి. ఈశ్వర్ నాయక్ భార్య వి. లక్ష్మీబాయికి రూ. 20,000 ఆర్థిక సహాయం చెక్కులను ఎస్పీ అందజేశారు.

దీనితో పాటు ఇటీవల పదవీ విరమణ పొందిన హోంగార్డు టి. శ్రీనివాసులుకు జిల్లాలోని తోటి హోంగార్డులంతా తమ ఉదారతను చాటుకుంటూ ఒక రోజు వేతనాన్ని విరాళంగా సేకరించిన మొత్తం రూ. 2,23,650/- చెక్కును ఎస్పీ ఆయనకు అందజేశారు. తోటి సిబ్బందికి కష్టం వస్తే ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న అన్నమయ్య జిల్లా హోంగార్డులందరినీ ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ ఎ. శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Police Department stands by the families of affected Home Guards.