- బ్యాగులో సుమారు రూ.4.50 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు గుర్తింపు.
- కుటుంబ సభ్యులను గుర్తించి వెంటనే సంప్రదించిన ట్రాఫిక్ సిబ్బంది.
- పోలీసుల నిజాయితీ, సేవాభావానికి బాధిత కుటుంబ సభ్యుల ప్రశంసలు.
- తిరుమల ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ నిజాయితీ, సేవాభావాన్ని చాటుకున్నారు.
తిరుపతి ముచ్చట్లు:
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుమలకు విచ్చేశారు. దర్శనానికి వెళ్తున్న క్రమంలో పీఏసీ–3 సమీపంలో తమ బ్యాగును అనుకోకుండా మరిచిపోయారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న తిరుమల ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి.వి. రావు ఆ బ్యాగును గుర్తించి పరిశీలించగా, అందులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు సుమారు 30 గ్రాముల బరువు గల, సుమారు రూ.4,50,000 విలువైన బంగారు తాళిబొట్టు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే బ్యాగులో లభించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించి సంప్రదించిన ట్రాఫిక్ పోలీసులు, బ్యాగును సురక్షితంగా వారికి అప్పగించారు. తమ విలువైన వస్తువులు తిరిగి లభించినందుకు సునీల్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి.వి. రావు కి, అలాగే తిరుమల ట్రాఫిక్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ, “ప్రజల ఆస్తులను భద్రంగా కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి.వి. రావు చూపిన నిజాయితీ, విధి నిర్వహణ పట్ల అంకితభావం అభినందనీయం. ఇలాంటి సంఘటనలు పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ కోసం తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నాను” అని తెలిపారు.
Tags: Traffic police safely hand over lost bag to its owner.