May 29, 2026
Explore
‘ఆపరేషన్ దండాయన’.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి

‘ఆపరేషన్ దండాయన’.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి

May 29, 2026 | Andhra Pradesh

: – జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, వారిపై జరిగే నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ దండాయన” కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి పర్యవేక్షణలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానాన్ని జిల్లాలో క్షేత్రస్థాయిలో వేగవంతం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస, పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నేరస్థులపై కఠిన నిఘా ఉంచేందుకు, నేరాల నియంత్రణకు ‘శక్తి’ కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో మహిళా భద్రతకు సంబంధించిన గణాంకాలను వెల్లడిస్తూ, జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ, మహిళలపై నేరాలలో (క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్) 16 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కన్విక్షన్ (శిక్షలు) పడేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

మహిళలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ‘ జీరో టాలరెన్స్ విధానం’ అవలంబిస్తోందని, నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా సరే చట్టం ముందు లొంగాల్సిందేనని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని, మహిళల రక్షణ కోసం ప్రజలంతా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విచారణలో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని, సంచలనాత్మక కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో పదే పదే నేరాలకు పాల్పడే పునరావృత నేరస్థులు, అనుమానితులపై నిఘా కోసం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ‘సెక్సువల్ అఫెండర్ షీట్లు’ (SOS) తెరిచామని, జియో ట్యాగింగ్, ‘నైబర్ హుడ్ వాచ్’ పద్ధతుల ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు వెల్లడించారు.

బాధితులకు తగిన రక్షణ కల్పిస్తూ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామని ఎస్పీ గారు వివరించారు. కేవలం శిక్షించడమే కాకుండా, నేరస్థుల్లో మార్పు తీసుకువచ్చేందుకు సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా “పరివర్తన సదస్సులు” నిర్వహిస్తున్నామని, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడంతో పాటు నేరస్థుల్లో భయం కలిగించేలా.. ఇటీవల మహిళలపై జరిగిన నేరాల్లో కోర్టులు విధించిన కఠినమైన తీర్పుల వివరాలను జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) .ఎం. వెంకటాద్రి , మహిళా పోలీస్ స్టేషన్ సీఐ. జి.శంకర మల్లయ్య, కోర్ట్ మానిటరింగ్ ఇన్స్పెక్టర్ జె. ప్రసాద్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, డిసీఆర్ బి, ఎస్ఐ.బి. సహదేవి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Tags: ‘Operation Dandayana’ — Continuous surveillance must be maintained on the accused.