మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా రూపుమాపి, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కదలాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, పిలుపునిచ్చారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎన్-కార్డ్ (NCORD) సమీక్షా సమావేశంలో వారు పాల్గొని, జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గంజాయి నెట్‌వర్క్‌లపై నిరంతర నిఘా ఉంచామని, గతంలో నమోదైన కేసులు, నిందితుల నడవడికలను విశ్లేషిస్తూ ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. యువతను ఈ వ్యసనాల నుంచి కాపాడేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విక్రేతలపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మదనపల్లి, రాయచోటి పరిధిలో 6 ముమ్మర “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్లు నిర్వహించి, సుమారు 2500 వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసు శాఖ మూడు ప్రత్యేక ఆపరేషన్లను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తోందని ఎస్పీ గారు వివరించారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ ద్వారా పట్టణాలు, గ్రామాల్లోని అనుమానిత ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేస్తూ ప్రతి వీధిపై నిఘా పెంచామన్నారు. అలాగే విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు చేరకుండా ‘ఆపరేషన్ సేఫ్ జోన్ క్యాంపస్’ ద్వారా “కోప్టా” చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, విద్యార్థుల్లో చైతన్యం తెస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్ గరుడ’ ద్వారా మెడికల్ షాపుల్లో నిషేధిత మందుల విక్రయాలపై ఈగిల్ సెల్ నిరంతరం నిఘా ఉంచిందని ఎస్పీ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా, మండల స్థాయిలోని పీడీ డీఆర్‌డీఏ, మెప్మా, సచివాలయ సిబ్బంది, ఏపీఎంఎస్ఎస్, వెలుగు సిబ్బందితో పాటు వీపీఓలు, ఎస్ హెచ్ఓలు పూర్తి సమన్వయంతో గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో మరియు విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 112 తో పాటు, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. డ్రగ్స్ వినియోగదారులను తక్షణమే గుర్తించేందుకు విద్యాసంస్థల్లో ఆకస్మికంగా యూరిన్ టెస్ట్ కిట్ల వినియోగాన్ని పెంచాలని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల లోపు మైనర్లకు లేదా ఇతరులకు నిబంధనలకు విరుద్ధంగా మత్తు పదార్థాలు, నిషేధిత మందులు విక్రయిస్తే సదరు మెడికల్ షాపుల ట్రేడ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పదేపదే మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలకు పాల్పడే పాత నేరస్థులపై పీఐటీ ఎన్డీపీఎస్ (PIT NDPS) యాక్ట్ కింద కఠినంగా జైలుకు పంపుతామని ఆదేశించారు.
గ్రామస్థాయి నుంచే గంజాయిని పూర్తిగా నిర్మూలించి, అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చడం మన అందరి సామాజిక బాధ్యతని, ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ విక్రయాలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, 100/112 నెంబర్లకు గానీ లేదా ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు గానీ సమాచారం అందించి సహకరించాలని కోరారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి , ఎక్సైజ్ ఏఎస్పీ వై. జోగేంద్ర , మదనపల్లి డీఎస్పీ బి. పావని , వివిధ శాఖల అధికారులు మరియు ఈగిల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.“గ్రామస్థాయి నుంచే గంజాయి నిర్మూలన – డ్రగ్స్ రహిత అన్నమయ్యే లక్ష్యం”
Tags: The Goal is to Break the Grip of Addiction and Shape a Drug-Free District: Collector & SP