గోవింద నామస్మరణలతో మారుమోగిన బ్రహ్మోత్సవ వైభవం
రాత్రి ముత్యాల చల్లదనంలో భక్తులను ఆశీర్వదించనున్న గోవిందుడు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు సింహవాహనంపై అభయహస్తంతో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ దివ్య వాహనసేవలో మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేదఘోషలు, గోవిందనామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. వాహనం ముందు ఠీవిగా సాగిన గజరాజులు సేవకు మరింత మహోత్సవ శోభను చేకూర్చాయి. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
మృగరాజైన సింహం గాంభీర్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. యోగశాస్త్రంలో సింహం వేగశక్తికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం. భక్తునిలో సింహబలంలాంటి అచంచల భక్తి కలిగినప్పుడు భగవంతుని కృప ప్రసాదమవుతుందని ఆధ్యాత్మిక వాంగ్మయం తెలియజేస్తోంది. అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు రాక్షసుల హృదయాల్లో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతాడని పురాణాలు కీర్తిస్తున్నాయి. అందుకే ధీరోదాత్తుడైన శ్రీహరి సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు.
అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామివారు, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు సమర్పించారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుండగా, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు
నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్యమానంగా వెలుగొందుతుంటాడు. ముత్యపుపందిరిపై వెలసే స్వామివారి రూపం భక్తులకు మనోల్లాసాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యాలు చల్లదనానికి సంకేతం. సముద్రగర్భం ప్రసాదించిన అమూల్య రత్నమైన ముత్యాల కింద వెలసిన శ్రీనివాసుని దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, జీవితాల్లో శాంతి, చల్లదనాన్ని నింపుతుందనే విశ్వాసం భక్తుల్లో నెలకొంది.
ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







Tags:Sri Govindaraja Swamy, resplendent on the Lion Vahana.