అమరావతిముచ్చట్లు:
ఠారెత్తిస్తున్న ఎండలకు భూమి విపరీతంగా వేడెక్కుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వడగాలులు వీస్తున్నాయి. ఈ విపరీతాలన్నీ వాతావరణంలో వస్తున్న మార్పులు మాత్రమే కాదు..
ఈ వేడి మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మండే ఎండల్లో కుటుంబం గడవడం కోసం కూలీనాలీ చేసుకునే మహిళలు మనచుట్టూ ఎంతోమంది. ఎండల వల్ల ఆ మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ ప్రభావం వారి పునరుత్పత్తి సామర్థ్యంపై పడుతోంది. ముందస్తు ప్రసవాలు సంభవిస్తున్నాయి. “వడగాలుల ప్రభావం వల్ల కలిగే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకు మహిళలే ఎక్కువశాతం గురవుతున్నారు. ఈ కారణంగా సంభవించే మరణాల్లో కూడా వారి సంఖ్య పెరుగుతోంది” అని 2024లో భారత వాతావరణ శాఖ ప్రచురించిన అధ్యయనంలో తేలింది.
ఎండలకు గొంతు తడారిపోతున్నా కాసిన్ని నీళ్లు తాగలేని పరిస్థితి షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్నారు. అలా ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న నారాయణమ్మ తన అనుభవాన్ని ఇలా చెప్పింది. “ఉదయం పది గంటలకు షాపునకు వెళతాను. అన్నం బాక్సుతో పాటు నీళ్ల సీసా తీసుకెళతాను. బయట భగ్గుమంటున్న వేడికి సీసాలో నీళ్లు కాలిపోతున్నాయి. దాహం వేసినప్పుడు వాటిని తాగలేం. షాపులో ఎక్కడో మంచినీళ్లు ఉంటాయి. పదే పదే అక్కడికి వెళ్లడం కుదరదు. ఎప్పుడో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చల్లని నీళ్లు తెచ్చుకుని తాగుతాను” అంటోంది. ఈ పరిస్థితి నారాయణమ్మ ఒక్కదానిదే కాదు; పెద్ద, చిన్నా మాల్స్‌లో పనిచేస్తున్న ఎంతోమంది మహిళలది. ఎండాకాలం వదులైన దుస్తులు ధరించాలి. కానీ షాపింగ్ మాల్స్‌లో పనిచేసే మహిళలకు ఆ సౌలభ్యం ఉండదు. ఈ కారణంగా కూడా వారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మన దేశంలో చాలీచాలని గదులలో, నెత్తికి చూరు తగులుతున్న ఇళ్లల్లో నివసించే వారు అనేకమంది ఉంటారు. అరవై ఏళ్ల విజయమ్మ తాడేపల్లి సుందరయ్య కట్ట మీద ఓ చిన్న రేకుల ఇంట్లో నివసిస్తోంది. “మూడేళ్ల నుండి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి” అంటోంది. “వేడి తట్టుకోలేక పొరుగింట్లోకి వెళ్లి తలదాచుకుంటున్నా” అని చెబుతోంది. “ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకేలా ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తోంది” అని ఆయాసపడుతూ చెబుతోంది. విజయమ్మ లాంటి గృహిణులు ఎంతోమంది ఇళ్లల్లో ఉండి కూడా వడదెబ్బకు గురవుతున్నారు.
ఈ కాలంలో పొలం పనులు చేసే మహిళలు ఎండలోనే పనిచేయాలి. అయితే నిప్పులు చెరుగుతున్న ఎండలో పనిచేయలేక వారంతా చీకటితో పొలం పనులకు వెళ్లాల్సి వస్తోంది. కుంచనపల్లి పసుపుతోటలో పనికి వెళ్తున్న రమణమ్మ ఈ పరిస్థితి గురించి ఇలా చెప్పింది. “తెల్లవారుజాము 4 గంటలకే నిద్ర లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటాను. 5 గంటలకల్లా రోడ్డు మీదకు వెళ్లాలి. పనోళ్ల కోసం ఆటో వస్తుంది. అది తప్పితే ఆ రోజు పనికి వెళ్లడం కుదరదు. ఆదరాబాదరా పని చేసుకుని వెళతాను. ఉదయం 11 గంటల వరకు పని చేస్తాం. మధ్యాహ్నం అక్కడే ఉండిపోయి సాయంత్రం మళ్లీ పనిలోకి వెళ్తున్నాం. రాత్రి 9:30, 10 గంటల వరకు కూడా పని చేసి వస్తున్నాం” అంటోంది. “ఈ ఒత్తిడి నీ ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తోంది” అన్నప్పుడు రమణమ్మ కళ్లల్లో నీటి చెమ్మ కనిపించింది. “ఒకటే దడగా ఉంటది. ఇంటి పని, పొలం పని చేయడం అలవాటే. కానీ ఎండాకాలం వస్తే చాలు పరుగులు పెడుతూ పనులు చేయాలి. దాని వల్ల నా ఒళ్లు గుళ్లవుతోంది” అంటోంది._
మహిళల్లో మరణాల రేటు పెరిగింది!
ఈ మహిళలు వ్యక్తపరచిన ఈ అభిప్రాయాలు దేశంలో కోట్లాది మంది మహిళల వాస్తవ జీవితాలను మన కళ్లముందు ఉంచుతున్నాయి. 2024లో వెల్లడించిన అధ్యయనం ప్రకారం 1980-2000 మధ్య భారతదేశంలో తేమతో కూడిన ఉష్ణోగ్రత తీవ్రత 30 శాతం పెరిగింది. ఈ తీవ్రత ఇప్పుడు మరింత వేగం అయ్యింది. పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతల తీవ్ర ప్రభావాన్ని పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు నివేదికలో తెలిపారు. ఉష్ణోగ్రత మార్పుల కారణంగా పురుషులలో మరణాల రేటు 23.11% (2000-2010), 18.7% (2010-2019) మేర తగ్గినట్లు నివేదికలో తేలింది. అయితే ఈ రెండు కాల వ్యవధులలో స్త్రీల మరణాల రేటు వరుసగా 4.63%, 9.84% మేర పెరిగింది.
పెరుగుతున్న ఈ వేడికి మహిళల శరీరాలు భిన్నంగా స్పందిస్తాయి. హార్మోన్ల హెచ్చు తగ్గులు, జీవక్రియ రేట్లు, శరీర నిర్మాణం అన్నీ శరీరం ఎదుర్కొనే వేడిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్, అలసట, వేడి సంబంధిత అనారోగ్యాలకు ఎక్కువగా గురవుతారు. ఈ ప్రభావం గర్భిణీలను ఎక్కువ ప్రమాదాలకు గురిచేస్తుంది. తీవ్రమైన వేడి, నెలలు నిండక ముందే ప్రసవాలు, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, మృత శిశు జననాలు పెరగడం, తల్లి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడానికి కారణమవుతుంది. దేశవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు ఈ విషయాలపై పదే పదే హెచ్చరిస్తున్నాయి.
వాతావరణ మార్పుల్లో ప్రస్తావన లేదు
వడగాలులు మహిళల ఆరోగ్యంపై ఇంతలా ప్రభావం చూపుతున్నా వాతావరణ విధానాల్లో ఎక్కడా వాళ్ల ప్రస్తావన ఉండడం లేదు. తీవ్రమౌతున్న వేడి మహిళలు, పేదరికం, శ్రమ, గృహవసతి, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలతో ముడిపడిన అంశంగా గుర్తించాలి. వడగాలుల ప్రభావం కేవలం మరణాల గణాంకాలకే పరిమితం కాదు. వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల రుగ్మతలు, మానసిక ఒత్తిడి, పని సామర్థ్యం తగ్గడం వంటివన్నీ సుదీర్ఘ కాలంలో ఎదురయ్యే సమస్యలు.
ప్రపంచంలో అత్యధిక వేడిమికి గురయ్యే దేశాలలో మన దేశం ఒకటి. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ప్రకారం ప్రపంచ సగటు కంటే దక్షిణాసియా వేగంగా వేడెక్కుతోంది. మన దేశంలో ఒక్క రోజు జీతం రాకపోతే కూడా కుటుంబాన్ని పోషించుకోలేని కుటుంబాలు ఎక్కువ. ఆ కుటుంబాల్లోని కోట్లాది మంది మహిళలు కనీస మౌలిక వసతులు లేని పని ప్రదేశాల్లో పనిచేస్తున్నారు. పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతలు వాళ్ల పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.
ఇంట్లో, బయటా ఒకేలాంటి పరిస్థితి!
మన దేశంలో అనేక చోట్ల మహిళలు ఇంటి అవసరాలకు కిలోమీటర్ల కొద్దీ ఎండలో నడిచి నీళ్లు సేకరిస్తారు. పంట కోయడం, పశువులను సంరక్షించడంలో కూడా మహిళల భాగస్వామ్యం ఎక్కువ. పనులకు వెళ్లే మహిళలే కాదు, ఇంట్లో ఉండే మహిళలు కూడా ఒకేలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఎండల్లో పిల్లల సంరక్షణ, ఇంటి నిర్వహణ మహిళలపై అదనపు భారాన్ని తెచ్చిపెడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు ఎక్కువకాలం వేడికి గురవ్వడం ఆందోళన, నిద్రలేమి, భావోద్వేగ ఒత్తిడి, మానసిక క్షోభ పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నాయి. ఈ వేడి కారణంగా మహిళలకు ఆరోగ్య పరంగానే కాదు, సన్నిహిత భాగస్వాముల నుండి ఎదుర్కొనే హింస కూడా తీవ్రమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి నేపాల్ (14.8), పాకిస్తాన్ (5.9) శాతాలతో పోలిస్తే భారత్‌లో (23.5) శాతానికి ఈ హింస పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. “ఇక నుండి వాతావరణ మార్పు గురించి మాట్లాడేటప్పుడు ఉష్ణోగ్రతల్ని మాత్రమే కాదు, ఆ వేడిని మోస్తున్న మహిళల జీవితాల్ని కూడా చూడాలి” అని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
Tags: The Scorching Season… Its Impact on Women!