: అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న ప్రచార హోరు..
మదనపల్లి ముచ్చట్లు:
సమాజంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మత్తు పదార్థాలు లేని ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘సురక్షిత సమాజం – మనందరి బాధ్యత’ అనే నినాదంతో పోలీసులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఈ మేరకు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి గల్లీలోనూ ఆటోలకు ప్రత్యేక బ్యానర్లు కట్టి, లౌడ్ స్పీకర్ల ద్వారా నేరాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నేటి యువతను పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్ల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ “డ్రగ్స్ వద్దు బ్రో” అంటూ యువతకు హితబోధ చేస్తున్నారు. గంజాయి వాడకం బ్రెయిన్‌ను దెబ్బతీయడమే కాకుండా, కుటుంబాలకు తీరని వేదన మిగిలిస్తుందని హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా గంజాయి అమ్మకాలు, జూదం, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 112 (పోలీస్ హెల్ప్ లైన్), 1930 (సైబర్ క్రైమ్), 1972 (గంజాయి హెల్ప్ లైన్) , మరియు 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) వంటి నంబర్లను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని కోరుతూ క్షేత్రస్థాయిలో సీఐలు, ఎస్ఐలు స్వయంగా పాల్గొని ఈ అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
Tags:Women’s Safety — The Goal is the Eradication of Narcotics