May 23, 2026
Explore
నల్లచెరువు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

నల్లచెరువు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

May 23, 2026 | Andhra Pradesh

కదిరి ముచ్చట్లు:

నైట్ బీట్, పెట్రోలింగ్ విధులను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం

జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, రాత్రివేళల్లో నేరాల నివారణకు ముందస్తు చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కదిరి అర్బన్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌తో పాటు వలీసాబ్ రోడ్, నిజాం కాలనీ, కుటాగుళ్ల, కదిరి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు మరియు నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది హాజరు, బాధ్యతల నిర్వహణ, నైట్ బీట్ వ్యవస్థ పనితీరును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.అనంతరం బీట్ పాయింట్లు, పెట్రోలింగ్ ప్రాంతాల్లో పర్యటించి భద్రతా చర్యలు, గస్తీ నిర్వహణపై సమీక్షించారు.జిల్లా హెడ్‌క్వార్టర్స్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, రాత్రి గస్తీ నిర్వహణ, అనుమానితుల కదలికలపై సమాచార సేకరణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో నేరుగా మాట్లాడిన ఎస్పీ ప్రజల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, దేవాలయాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బీట్ వ్యవస్థ సమర్థవంతంగా కొనసాగాలని ఆదేశించారు.
ప్రతి ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా
రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైతే వేలిముద్రలు సేకరించాలని సూచించారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలు మరియు ఇతర అసాంఘిక చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.

వాహన తనిఖీలు మరింత కట్టుదిట్టం చేయాలి
వాహన తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని,
బీట్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

“ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం” – జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ మాట్లాడుతూ, “ప్రజల రక్షణ, నేరాల నివారణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం” అని పేర్కొన్నారు. రాత్రివేళల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతంగా కొనసాగుతాయని తెలిపారు.
అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా రాత్రివేళల్లో బయట సంచరించవద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ తనిఖీలలో కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: District SP Conducts Surprise Inspections at Nallacheruvu Police Station