May 23, 2026
Explore
మదనపల్లిని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుదాం

మదనపల్లిని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుదాం

May 23, 2026 | Andhra Pradesh

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి పట్టణాన్ని శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం మదనపల్లి పట్టణంలోని అనిబిసెంట్ కూడలి నుంచి బెంగళూరు రోడ్డు బస్ స్టాండ్ వరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో కలిసి కలెక్టర్, జేసి స్వయంగా చెత్తాచెదారాలను తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే నాలుగు వారాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు. విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, మున్సిపల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, ప్రజలందరి భాగస్వామ్యంతో పరిశుభ్రమైన పట్టణంగా మదనపల్లిని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

సోర్స్ సెగ్రిగేషన్, రేడియల్ స్పాట్స్ క్లీనింగ్, చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రత అనేది కేవలం ఉదయం చేసే పని కాదని, శాశ్వతంగా పరిశుభ్రతను కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు, రోజువారీ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించే షాపులు, హోటళ్లు, గృహ యజమానులకు ముందుగా అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు. అయినప్పటికీ మార్పు రాకపోతే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం, అవసరమైతే షాపులను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలులో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్, ప్రతి పౌరుడు పరిసరాల పరిశుభ్రతలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ప్రజలందరూ సహకరిస్తే మదనపల్లిని ఆదర్శ పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దగలమన్నారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ను డ్రైవ్ మోడ్‌లో అమలు చేస్తున్నామని తెలిపారు. మొదటి వారంలో ప్రజలకు అవగాహన కల్పించడం, పరిశుభ్రత పాటించేలా ప్రోత్సహించడం, నిబంధనలు ఉల్లంఘించే షాపులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. మదనపల్లి పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ శాఖ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Tags: