- సోషల్ మీడియా ఫోటోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులు చేసిన నిందితుడు.
- కేసు నుంచి తప్పించేందుకు సహకరించిన మహిళా అధికారిణి అరెస్ట్.
- పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
- మైనర్ బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
తిరుపతి ముచ్చట్లు:
16 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలికపై ఆమె పిన్ని భర్త అయిన రామ్మూర్తి (51), తిరుపతి జీఎస్టీ డిపార్టుమెంటులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి పోలీసులు తెలిపారు.
నిందితుడు తిరుపతిలో తాను నివసిస్తున్న ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బాధిత బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అదేవిధంగా బాధితురాలితో ఫోన్ మరియు షేర్ చాట్ ద్వారా జరిపిన చాట్స్, కలిసి దిగిన సన్నిహిత ఫోటోలను తన వద్ద ఉంచుకొని, తాను పిలిచినప్పుడు రాకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును జ్యూరిస్డిక్షన్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సదరు జీరో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ భక్తవత్సలం గారు కేసును లోతుగా దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించారు.
దర్యాప్తులో ప్రధాన నిందితుడు రామ్మూర్తితో పాటు, కేసు నుంచి అతన్ని తప్పించేందుకు సహకరించిన బాధితురాలి పిన్ని మానస, డిప్యూటీ తహసీల్దార్, రైల్వే కోడూరు వారి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరినీ తేదీ 21-05-2026 సాయంత్రం 5.30 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:
మైనర్ బాలలపై జరిగే లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ వంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తిరుపతి పోలీసులు సూచించారు. సోషల్ మీడియా, చాట్ యాప్స్ ద్వారా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా తల్లిదండ్రులు లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
మైనర్ బాలల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, బాధితుల గోప్యతను పరిరక్షిస్తూ నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి పోలీసులు స్పష్టం చేశారు.
Tags: Main Accused Arrested in Sexual Assault Case Involving a Minor Girl.