May 21, 2026
Explore
గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం లో ఫారెస్ట్ అధికారుల పాత్ర పై అనుమానం

గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం లో ఫారెస్ట్ అధికారుల పాత్ర పై అనుమానం

May 21, 2026 | Andhra Pradesh

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన…!

జేసీబీతో తవ్వి బంగారం కుండలు వెలికితీత!

పోలీసుల విచారణ లో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం

మార్కాపురం ముచ్చట్లు:

గిద్దలూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం కలకలం రేపుతోంది.

ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మార్కాపురం జిల్లా తురిమెళ్ళ అటవీ క్షేత్ర స్థాయి అధికారులు.. ట్రైబల్ వాచర్లతో కలిసి గుప్తనిధులు తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు.

ఈ తవ్వకాల్లో ఓ రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా అందులో వజ్రాలు, బంగారం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్రయత్నించి అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఈ సమాచారం గురించి అటవీశాఖ అధికారులను మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించడం లేదు.

వెలగలపాయ ఫారెస్ట్‌ బీట్‌ అధికారికి యర్రగొండపాలెంకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మేరకు ఈ తవ్వకాలు చేసినట్టు తెలిసింది… గిరిజన ట్రైబల్‌ వాచర్ల సాయంతో భారీగా తవ్వకాలు జరిపి గుప్తనిధుల కుండలు వెలికితీసి, ఆ సందర్బంగా తీసినట్టుగా చెబుతున్న ఓ వీడియో ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ లంకెబిందెల్లో బంగారం, వజ్రాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో అటవీ అధికారులు తీసుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో కూడా స్వయంగా పోస్ట్‌ చేశారట. గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం పోలీసులకు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది… పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

Tags: Suspicion regarding the role of forest officials in the excavation for hidden treasures.