తనిఖీలు పూర్తయ్యే వరకు బాణసంచా కేంద్రాలను మూసివేయాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్.*
మదనపల్లి ముచ్చట్లు:
ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా టపాసుల తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై తక్షణమే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తనిఖీలు పూర్తయ్యే వరకు జిల్లాలోని అన్ని బాణసంచా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు.
సంయుక్త తనిఖీలు.. ముమ్మర నిఘా..
జిల్లాలోని మదనపల్లి, రాయచోటి సబ్-డివిజన్ల పరిధిలో రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సమన్వయంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
👉ప్రధానంగా కింది అంశాలపై అధికారులు దృష్టి సారించారు..
లైసెన్సుల పరిశీలన
“కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) నిబంధనల ప్రకారం బాణసంచా నిల్వ కేంద్రాలకు ఖచ్చితంగా లైసెన్స్‌లు ఉండాలి.”
ఎక్స్‌ప్లోజివ్ రూల్స్, PESO నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా? లేదా? అని తనిఖీ చేస్తున్నారు.
భద్రతా ప్రమాణాలు
గోడౌన్లలో తగినంత ఇసుక, నీరు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ‘స్పార్క్-ప్రూఫ్’ సిస్టమ్స్ ఉండాలని స్పష్టం చేశారు.
నిఘా నేత్రం
ప్రతి విక్రయశాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ఫీడ్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించాలని ఆదేశించారు.
పరిమితి దాటితే సీజ్!”అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తయారీ కేంద్రాల్లో కార్మికులు సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులనే ధరించాలి. నిబంధనల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు” అని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా టపాసులు నిల్వ చేస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.