అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. అశ్రునయనాలతో తుది వీడ్కోలు..
💠కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగంలో విషాదం నెలకొంది. జిల్లా ఏఆర్ (ఆర్మ్ డ్ రిజర్వ్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్ 3571 గా విధులు నిర్వహిస్తున్న ఎం. రంగారావు (52) అనారోగ్యంతో గురువారం రాత్రి కర్నూలులో కన్నుమూశారు. విధి నిర్వహణలో నిబద్ధత గల హెడ్ కానిస్టేబుల్ గా పేరు తెచ్చుకున్న ఆయన అకాల మరణం పట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కర్నూలులో అంతిమ యాత్ర..
కర్నూలు నగరంలోని సీతారాం నగర్ నివాసంలో ఉంచిన రంగారావు పార్థివ దేహాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ (వెల్ఫేర్) ఎం. రవికుమార్ సందర్శించారు. పోలీస్ శాఖ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక స్మశానవాటికలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. కర్నూలు రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గన్ సెల్యూట్‌తో అధికారిక లాంఛనాలతో అంజలి ఘటించారు.
34 ఏళ్ల విశిష్ట సేవలు..
1992లో కర్నూలు 2వ బెటాలియన్‌లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా రంగారావు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కడప జిల్లా భాకరాపేట 11వ బెటాలియన్‌కు, ఆపై ఏఆర్ కన్వర్షన్‌తో చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది, జిల్లా పునర్విభజన తర్వాత అన్నమయ్య జిల్లాలో విధుల్లో చేరారు. మూడు దశాబ్దాలకు పైగా నిరంతర సేవలు అందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.
ఎస్పీ సంతాపం..
రంగారావు మృతి పట్ల జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఒక అనుభవజ్ఞుడైన హెడ్ కానిస్టేబుల్ ను కోల్పోవడం బాధాకరమన్నారు. “రంగారావు మరణం పోలీస్ శాఖకు తీరని లోటు. వారి కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది. అందాల్సిన ప్రయోజనాలన్నీ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ పేర్కొన్నారు.
ఆర్థిక సాయం అందజేత..
మృతుని భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పరామర్శించారు. ఎస్పీ సూచన మేరకు తక్షణ సహాయంగా ‘దహన సంస్కారాల’ నిమిత్తం లక్ష రూపాయల (₹1,00,000/-) నగదును మృతిని భార్య చంద్రకళ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని తమ సహచరుడికి ఘన నివాళులర్పించారు.

Tags: AR Head Constable Rangarao Passes Away