May 15, 2026
Explore
ఈసీ ఎంపికలో తటస్థులుండాలి!

ఈసీ ఎంపికలో తటస్థులుండాలి!

May 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుంటే, స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించకుంటే ఆ ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర ధర్మాసనం పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం, సర్వీసు నిబంధనల చట్టం-2023 చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై తుది విచారణ గురువారం జరిగింది. సీఈసీ, ఈసీల ఎంపిక కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభ విపక్షనేతతో పాటు మూడో సభ్యుడిగా కేంద్ర మంత్రిని చేర్చడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు.

గతంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన ప్రకారం….ఈ ఎంపిక కమిటీ సభ్యుల్లో కేంద్ర మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలి. కానీ, కేంద్రం ఆ సూచనను పాటించకపోవడం ఎన్నికల సంఘం స్వతంత్రతను, తటస్థతను దెబ్బతీస్తుందని పిటిషనర్లు ఆరోపించారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి 2023 చట్టాన్ని గట్టిగా సమర్థించారు. ‘ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సూచించిన తాత్కాలిక ఏర్పాటును పాటించాల్సిన బాధ్యత పార్లమెంటుకు లేదు’ అని వాదించారు. శాసన నిర్మాణ సంపూర్ణాధికారం పార్లమెంటుకే ఉంటుందన్నారు. ఊహాజనిత పక్షపాత ఆరోపణల ఆధారంగా చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయలేదని పేర్కొన్నారు. శాసననిర్మాణ వ్యవస్థ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం తగదని నొక్కి చెప్పారు.

తటస్థ వ్యక్తి కేంద్ర మంత్రే ఎందుకవ్వాలి?

‘ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో మూడవ తటస్థ వ్యక్తి ఉన్నారు అనేంత స్థాయిలో విశ్వాసం కల్పించాలి. అది కేంద్ర మంత్రే ఎందుకవ్వాలి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు స్వతంత్రంగా, తటస్థంగా ఉన్నట్లూ కనిపించాలని తెలిపింది. ‘సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న సీజీఐ… ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో ఎందుకు ఉండరు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎంపిక కమిటీలో సీజేఐ తప్పనిసరిగా ఉండాలని మేం చెప్పడం లేదు. ఒక స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండరాదు. ప్రధాని ఒకరిని ఎంపిక చేస్తే…విపక్ష నేత మరొకరి వైపు మొగ్గు చూపవచ్చు. ఆ మూడో సభ్యుడు క్యాబినెట్‌ మంత్రి అయితే విపక్షనేత అభిప్రాయాన్ని సమర్థిస్తారా? కాదు కదా. కార్యనిర్వాహక వ్యవస్థ వీటో అధికారమే మమ్మల్ని కలవరపరుస్తోంది. ఎన్నో పూర్వ తీర్పులున్న కేసుల గురించి పార్లమెంటుకు తెలియదా? పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అంతిమ నిర్ణేత మాత్రం సుప్రీంకోర్టే’నని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా పేర్కొన్నారు. వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఒక సందర్భంలో ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సిఫార్సు చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అటార్నీ జనరల్‌ ఈ ఆలోచనను సమర్థించగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గోపాల శంకరనారాయణన్, షాదన్‌ ఫరాసత్‌ వ్యతిరేకించారు. ద్విసభ్య ధర్మాసనం పరిధి సరిపోతుందన్నారు.

Tags: Neutrals Must Be Included in the Selection of the Election Commission!