May 13, 2026
Explore
కూటమి సర్కార్ సంచలన నిర్ణయం..

కూటమి సర్కార్ సంచలన నిర్ణయం..

May 13, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

సమాజంలో దశాబ్దాలుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి లేమి మరియు గుర్తింపు సమస్యలతో సతమతమవుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్ 14ను విడుదల చేసింది

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఈ బోర్డులో వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్, రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కోటా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి), నక్క జీవన్ కుమారి (గుంటూరు), బోను దుర్గ (ప్రకాశం)లను సభ్యులుగా నియమించారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

కుటుంబాల నుంచి వెలివేత, విద్యావకాశాలు కోల్పోవడం, వైద్య సేవల్లో చిన్నచూపు వంటి సమస్యలకు ఈ బోర్డు పరిష్కారం చూపనుంది. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను గుర్తించి నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో వివక్ష లేకుండా చూడటం. వీరికి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సామాజిక భద్రత కల్పించడంపై బోర్డు కీలక సూచనలు చేస్తుంది. వారి సంక్షేమానికి తీసుకోవల్సిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వెల్ఫేర్ బోర్డు ముఖ్య ఉద్దేశ్యం

ట్రాన్స్‌జెండర్లపై వివక్షను నిషేధిస్తూ, వారిని సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇది వారి ఆత్మగౌరవ పోరాటంలో ఒక కీలక విజయంగా నిలవనుంది.

Tags: Coalition Government’s Sensational Decision