March 18, 2026
Explore
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ. 6లక్షల జరిమానా

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ. 6లక్షల జరిమానా

March 18, 2026 | Andhra Pradesh

  • తీర్పు వెల్లడించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి

శేషాచలం ముచ్చట్లు:

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహమూర్తి బుధవారం తీర్పు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF) కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు గారు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎఎస్పీ శ్రీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగూరి అమర నారాయణ ద్వారా పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 14/2017 కేసులో ఇద్దరు ముద్దాయిలు తిరుపతి జిల్లా నాగపట్ల అటవీ పరిధిలోని చామల రేంజ్ లో అరెస్టయ్యారు. వీరు తమిళనాడు, కృష్ణగిరి జిల్లా కు చెందిన సాదిక్ బాషా, గణేషన్ కాగా వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న టాస్క్ ఫోర్స్ దర్యాప్తు అధికారులను, కోర్టు సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags: Two Red Sandalwood Smugglers Sentenced to Five Years in Jail — ₹6 Lakh Fine