కర్నూలు ముచ్చట్లు:
వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న నెపంతో ఒక యువకుడికి అరగుండు చేయించి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో కలకలం రేపింది.
ఘటనతో గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. అరికేర గ్రామానికి చెందిన ఒక వివాహిత పట్ల అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొంతకాలంగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు
ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు సదరు యువకుడి కదలికలపై నిఘా పెట్టారు. మంగళవారం సదరు వ్యక్తి మళ్లీ వివాహితను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
అనంతరం సదరు వ్యక్తికి అరగుండు, అరమీసం గీయించి , మెడలో చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు
ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో గ్రామంలో కులపరమైన గొడవలు చెలరేగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానవీయంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
Tags: Young Man Paraded with Half-Shaven Head and Garland of Slippers