తిరుపతి ముచ్చట్లు:
రూ.18 లక్షల 50 వేల నగదు, 126 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీసుల విజ్ఞప్తి.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఇంటి తాళాలు వేసి ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో నగదు మరియు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు అదనపు ఎస్పీ (క్రైమ్స్) వివరాలు వెల్లడించారు.
ఈ కేసులో నిందితుడు ఢిల్లీకి చెందిన ధీరజ్ (27)గా గుర్తించారు. నిందితుడు గత కొంతకాలంగా విలాసాలకు బానిసై, తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయాలను గమనించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు 2024 సంవత్సరంలో తిరుపతి నగర పరిధిలో మొత్తం ఆరు చోరీ కేసులకు పాల్పడినట్లు అంగీకరించాడు.
నిందితుడి వద్ద నుంచి మొత్తం రూ.18,50,000 నగదు, సుమారు 126.135 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు గొలుసులు, ఉంగరాలు, బంగారు చైన్లు, లక్ష్మీ డాలర్ చైన్, చెవిపోగులు, ఇతర బంగారు వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ నేరాలకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
ముఖ్యంగా అదనపు ఎస్పీ (క్రైమ్స్) పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది సమన్వయంతో వేగంగా దర్యాప్తు నిర్వహించి కేసును విజయవంతంగా ఛేదించారు.
ప్రజలు తమ ఇళ్లను కొంతకాలం ఖాళీగా వదిలి వెళ్లే సందర్భాల్లో పొరుగువారికి సమాచారం ఇవ్వడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదా పోలీసువారికి సమాచారం ఇచ్చిన ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాలను ఉచితంగా ఏర్పాటు చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Tags: Accused arrested for committing thefts by locking up houses.