May 8, 2026
Explore
గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీ వేదనారాయణస్వామివారి రథోత్సవం

గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీ వేదనారాయణస్వామివారి రథోత్సవం

May 8, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తజనం

మే 9న చక్రస్నానం, ధ్వజావరోహణం

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం జరిగిన రథోత్సవం భక్తి పారవశ్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ స్వామివారి రథయాత్ర గ్రామ వీధులను ఆధ్యాత్మిక కాంతులతో నింపింది.

ఉదయం 6.25 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారు మహారథాన్ని అధిష్ఠించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. “గోవిందా… గోవిందా…” నామస్మరణల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు.

అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేదపారాయణం, ప్రబంధం, శాత్తుమొర నిర్వహించి మహాహారతి సమర్పించారు.
రథోత్సవం ఆధ్యాత్మికంగా విశిష్టమైన తత్త్వాన్ని తెలియజేస్తుంది. శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, ఆత్మ రథికుడనే భావన ద్వారా ఆత్మానాత్మ వివేకాన్ని ఈ ఉత్సవం భక్తులకు బోధిస్తుంది.

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారు, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు అశ్వవాహన సేవ జరగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెంగల్ రాయులు తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మే 9న చక్రస్నానం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Tags:Sri Vedanarayana Swamy’s Chariot Festival Celebrated Grandly Amidst the Chanting of ‘Govinda’