May 2, 2026
Explore
తిరుమలలో ప్రత్యేక నాఖాబందీ తనిఖీలు

తిరుమలలో ప్రత్యేక నాఖాబందీ తనిఖీలు

May 2, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • 44 షాపుల తనిఖీ, 18 మంది అనుమానితులు అదుపులోకి – 3 వాహనాలు స్వాధీనం

తిరుమలలో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేసే క్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, , చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ, పర్యవేక్షణలో, తిరుమల అదనపు ఎస్పీ సూచనలతో, తిరుమల డి.ఎస్.పి ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లోని షాపుల వద్ద ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా నాఖాబందీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్, టీటీడీ విజిలెన్స్, అటవీ, ఫైర్, రెవెన్యూ, ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు, బాంబ్ డిస్పోజల్ బృందాలకు చెందిన సుమారు 45 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.

తనిఖీలలో భాగంగా మొత్తం 44 షాపులను పరిశీలించగా, సరైన గుర్తింపు కార్డులు లేని 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, 3 గుర్తింపు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 66 మంది వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించారు.

వాణిజ్య ప్రాంతాల్లో లైసెన్సులు, సిబ్బంది వివరాలు, సబ్‌లీజ్ అంశాలను తనిఖీ చేశారు. గంజాయి, మద్యం, పొగాకు వంటి నిషేధిత వస్తువులు వినియోగించరాదని, అపరిచితులకు షాపులు అద్దెకు ఇవ్వరాదని, కొత్తగా పనిలో చేరిన వారి వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా అత్యవసర సేవల కోసం 1972, 112 నంబర్లపై అవగాహన కల్పించారు.

Tags:Special Checkpoint Inspections in Tirumala