పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది బి. సురేష్ బాబు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల మేరకు ఆయన సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాలను అందుకున్నారు. అనంతరం పుంగనూరు కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరీఫా ను కలిసి ఏజీపీగా తన బాధ్యతలను అధికారికంగా చేపట్టారు. సురేష్ బాబుకు న్యాయవాద వృత్తిలో ఉన్న సుదీర్ఘ అనుభవం మరియు ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం, బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మూడేళ్ల కాలపరిమితికి ఆయనను ఈ పదవిలో నియమించింది. కాగా, పుంగనూరు కోర్టు చరిత్రలోనే కాపు సామాజిక వర్గం నుండి ఏజీపీ పదవిని దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా సురేష్ బాబు నిలవడం విశేషం. తన నియామకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో విధులను నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, తోటి న్యాయవాదులు మరియు మిత్రులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.

Tags: B. Suresh Babu Assumes Charge as AGP of Punganur