April 26, 2026
Explore
జిల్లాలో అసాంఘిక శక్తులపై నిఘా…

జిల్లాలో అసాంఘిక శక్తులపై నిఘా…

April 26, 2026 | Andhra Pradesh

అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం – కఠిన చర్యలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు..

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎటువంటి రాజీలేని కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎక్కడా రౌడీయిజం, అక్రమ మద్యం విక్రయాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ జారీ చేసిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి..👇

అక్రమ మద్యం, బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా: జిల్లాలో అనుమతి లేని బెల్ట్ షాపులపై విస్తృత దాడులు నిర్వహించాలి. సమయ పాలన పాటించని మద్యం దుకాణాల యాజమాన్యాలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కోడిపందాలపై నిరంతర నిఘా ఉంచి, నిర్వాహకులపై కఠిన కేసులు నమోదు చేయాలి. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం దృష్టి సారించాలి.

మహిళా భద్రత – ‘శక్తి’ టీమ్స్: మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థలు, కార్యాలయాల వద్ద ‘శక్తి’ టీమ్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలి. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించే వారిపై నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లలో మహిళా రిసెప్షనిస్ట్‌ల ద్వారా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి..

సాంకేతికతతో నిఘా నేత్రం:
డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి సాగు, అక్రమ రవాణా, జూద కేంద్రాలను గుర్తించాలి. ‘ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్’ ప్రకారం వాణిజ్య సంస్థలు, లాడ్జీలు, అపార్ట్‌మెంట్లలో సి.సి. కెమెరాల ఏర్పాటు చేసుకునేలా యాజమాన్యాలకు అవగాహన కల్పించాలి.

ప్రజా సమస్యలకు ప్రాధాన్యం:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదులను గౌరవప్రదంగా స్వీకరించి, నిర్ణీత గడువులోగా చట్టబద్ధంగా పరిష్కరించాలి. భూ వివాదాలు, ఆర్థికపరమైన కేసులపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలి.

రోడ్డు భద్రత:
రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్‌లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలి.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ప్రజలకు రక్షణ కల్పించడంలో అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Tags: Surveillance on anti-social elements in the district…