తిరుపతి ముచ్చట్లు:
- రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం – తుక్కివాకం సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ యార్డులో భారీగా గంజాయి దగ్ధం.
- సుమారు 4100 కిలోల గంజాయి పూర్తిగా నాశనం.
- దాదాపు రూ.20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల ధ్వంసం.
- జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమక్షంలో ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రంతో దహనం.
- జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణపై కట్టుదిట్టమైన అమలు చర్యలు.
- గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా.
- తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసులకు సంబంధించిన మాదక ద్రవ్యాలను, రేణిగుంట మండలం పరిధిలోని ఎర్రంరెడ్డి పాలెం తుక్కివాకం సాలిడ్ వెస్ట్ డంపింగ్ డంపింగ్ యార్డులో చట్టపరమైన విధానాల ప్రకారం పూర్తిగా నాశనం చేయడం జరిగింది. మొత్తం సుమారు 4100 కిలోల గంజాయిని ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రం సహాయంతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సమక్షంలో దహనం చేయగా, దీని మార్కెట్ విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
- కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా స్థాయిలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. యువతకు అవగాహన కల్పించేందుకు లక్షమంది విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆన్‌లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
- జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో స్వాధీనం చేసుకున్న గంజాయిని నాలుగు వేల కిలోలకు పైగా దగ్ధం చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలపై పోలీసులు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నారని, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో మాదక ద్రవ్యాలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
- గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువతలో ఆరోగ్య సమస్యలు, మానసిక అస్వస్థత, చదువుపై నిర్లక్ష్యం, కుటుంబ సంబంధాల్లో విఘాతం వంటి అనర్థాలు కలుగుతాయి. అదనంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు నేరప్రవర్తన వైపు మళ్లే ప్రమాదం ఉండటంతో సమాజంలో శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. అలాగే సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
- ప్రజల భాగస్వామ్యం కీలకం గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలపై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసారు.
- ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకటరావు (పరిపాలన) రవి మనోహర చారి (శాంతిభద్రతలు) మరియు సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు,ఈగల్, ఎక్సైజ్ శాఖ అధికారులు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.
Tags: Cracking down on narcotics.