October 30, 2026
Explore
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఫ్లాగ్ మార్చ్‌లు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఫ్లాగ్ మార్చ్‌లు.

October 30, 2026 | Andhra Pradesh

  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు.
  • పోలీసుల కవాతుతో ప్రజల్లో భద్రతా భరోసా, ఎన్నికలపై అవగాహన.
  • ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన.
  • అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు.
  • ప్రశాంతమైన, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు.

తిరుపతి ముచ్చట్లు:

రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నాగలాపురం పట్టణం, వెస్ట్ కాలనీలో పోలీసు అధికారులు, సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతా భరోసా కల్పించారు. ఇదే విధంగా జిల్లాలోని ఇతర ఎన్నికల ప్రాంతాల్లోనూ ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లేదా ఇతరుల ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

అదేవిధంగా ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే అసాంఘిక శక్తులను పోలీసులు హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లాలో ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఫ్లాగ్ మార్చ్‌లు, వాహన తనిఖీలు, పెట్రోలింగ్ తదితర చర్యల ద్వారా శాంతిభద్రతలను పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏవైనా సమస్యలు లేదా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags:Police flag marches held across the district in the wake of local body elections.