April 17, 2026
Explore
శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం

శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం

April 17, 2026 | Andhra Pradesh

ఆలయాల్లో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణ చేయాలన్న సీఎం

దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం

రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని సూచన

దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న సీఎం

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా శ్రీవాణి నిధుల వినియోగంతో 5 వేల దేవాలయాలను రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో దేవాదాయ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..” శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలి. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి. ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలి. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలి. ”అని సీఎం స్పష్టం చేశారు.

పవిత్రతతో పాటు పారిశుద్ధ్యమూ ముఖ్యం

“రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయి. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి. దేవాలయాల్లో పవిత్రతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భక్తి భావంతో దర్శనం చేసుకునే వాతావరణం ఉండేలా చేయడంతో పాటు.. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్తారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల సందర్శన పెద్ద ఎత్తున పెరుగుతోంది. ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. 2025-26 సంవత్సరంలో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 1.20 కోట్లకు పైగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో 83.88 లక్షలు, సింహాచలంలో 65.48 లక్షలు, అన్నవరంలో 57.87 లక్షలు, ద్వారకా తిరుమలను 55.15 లక్షల మంది భక్తులు సందర్శించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉంది. భక్తులకు తాగు నీటి సౌకర్యం మొదలుకుని అన్నదానం వరకు అన్ని రకాల సేవలను అందించాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి

“రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే… 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నాం. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్న ప్రసాదం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోంది. దీని కోసం ఏడాదికి రూ. 157.85 కోట్లు వ్యయం అవుతోంది. ఆయా దేవాలయాల్లో పాకశాలల్లో పని చేసే వారికి శిక్షణ ఇప్పించాలి. దేవాలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్దిష్టమైన గడువులోగా సీజీఎఫ్ నిధులతో చేపట్టే దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలి. అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. అన్ని ఆలయాలకూ ప్రత్యేక వెబ్‌సైట్లు రూపొందించాలి. సమగ్ర వివరాలతో డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆగమ సలహా మండలి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, స్టాండింగ్ కౌన్సిల్ నియామకాన్ని త్వరితగతిన చేపట్టండి. ఇంకా పెండింగులో ఉన్న దేవాలయాల పాలక మండళ్లను వెంటనే నియమించాలి.”అని సీఎం సూచించారు.

దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి

“ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలి. ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగేలా చూడాలి. దీని కోసం టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ సిద్దం చేయాలి. భక్తుల రద్దీ నియంత్రణ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయండి. కేవలం భద్రత ఆధారంగా కాకుండా సంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో నిబంధనలు ఉండాలి. దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలి. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఈవోలు బదిలీపై వెళ్లే సమయంలో కొత్తగా వచ్చే అధికారులకు ముఖ్యమైన వివరాలను అందించి వెళ్లాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: 5,000 Temples Using Srivani Funds: AP CM Chandrababu Orders Completion Within Two Years.