April 17, 2026
Explore
ప్రధాని మోదీ తన మిత్రుడని పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్

ప్రధాని మోదీ తన మిత్రుడని పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్

April 17, 2026 | Andhra Pradesh

మా మధ్య చాలా మంచి సంభాషణ జరిగింది: ప్రధాని మోదీతో ఫోన్ కాల్‌పై ట్రంప్

ప్రధాని మోదీ తన మిత్రుడని పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్

మోదీతో ఫోన్‌లో చాలా బాగా మాట్లాడినట్టు చెప్పిన అమెరికా అధ్య‌క్షుడు

పశ్చిమాసియా భద్రత, సముద్ర మార్గాలపై చర్చించినట్టు వెల్లడి

అమెరికా ముచ్చట్లు:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని తన మిత్రుడుగా అభివర్ణించారు. ఆయనతో తాను చాలా బాగా మాట్లాడానని, ప్రస్తుతం పశ్చిమాసియాలో ప్రాంతీయ భద్రతకు సంబంధించిన దౌత్యపరమైన కార్యకలాపాలు జరుగుతున్న వేళ ఈ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. అదే సమయంలో ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ఆయన ప్రకటించారు.

ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సంభాషణ గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. “నేను ఆయనతో చాలా బాగా మాట్లాడాను. ఆయన భారత్‌ నుంచి నా స్నేహితుడు, చాలా గొప్పగా పనిచేస్తున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, తనకు అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించామని, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ ఆ పోస్టులో తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు, ముఖ్యంగా హ‌ర్మూజ్ జలసంధిని సురక్షితంగా, తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై కూడా చర్చించినట్టు ఆయన వివరించారు.

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
మరోవైపు పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవూన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో తాను అద్భుతమైన చర్చలు జరిపానని, శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరుపక్షాలు తాత్కాలిక సంధికి అంగీకరించాయని ఆయన తెలిపారు. ఇటీవల వాషింగ్టన్‌లో 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇరు దేశాలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో సమావేశమయ్యాయని ట్రంప్ గుర్తుచేశారు. “ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడం నాకు దక్కిన గౌరవం. ఇది నా 10వది అవుతుంది. దీన్ని పూర్తి చేద్దాం” అని వ్యాఖ్యానించారు.

Tags: Donald Trump described Prime Minister Modi as his friend.