April 15, 2026
Explore
మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్

మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్

April 15, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

రెండ్రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగొచ్చన్న ట్రంప్

పాకిస్థాన్‌లోనే ఈ భేటీ జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి

పాక్ ఆర్మీ చీఫ్ పాత్రపై ట్రంప్ ప్రశంసలు

చర్చలపై ఇరాన్ నుంచి స్పష్టత కరవు

ఇటీవలి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన వైనం

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రెండ్రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలు పాకిస్థాన్‌లో జరిగేందుకే తాము మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు.
న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయం వెల్లడించారు.

“రాబోయే రెండ్రోజుల్లో ఏదైనా జరగవచ్చు. మేము అక్కడికి (పాకిస్థాన్‌కు) వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చల విషయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయన అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించారు. అందుకే మళ్లీ అక్కడికే వెళ్లే అవకాశం ఉందని అన్నారు.

ఇటీవల వారాంతంలో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే, ఆ చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

మరోవైపు, టెహ్రాన్, పాకిస్థాన్ మధ్య సందేశాలు మార్పిడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. కానీ, అమెరికాతో మలివిడత చర్చలు జరపడంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. దీంతో చర్చల పునరుద్ధరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags: US-Iran Second Round of Talks in Two Days: Trump