సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించండి
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాల ప్రోత్సహిస్తాం
ప్రతి ఏడాది మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం
సమగ్రశిక్ష ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ఎవరెస్ట్ పర్వతారోహణ చేయనున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం
విద్యార్థుల నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించిన మంత్రి లోకేష్
దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ప్రతిభావంతుల ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర
విద్యార్థులను అభినందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
ఉండవల్లి ముచ్చట్లు:
కసి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. 21 మంది విద్యార్థుల బృందం ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేయనుంది. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించనున్నారు. వీరిలో 8 మంది బాలికలు ఉన్నారు. 15వ తేదీన మధ్యాహ్నం విద్యార్థుల బృందం నేపాల్ రాజధాని ఖాట్మండూకు చేరుకోనుంది. అక్కడి నుంచి ఈ ఎవరెస్ట్ పర్వతారోహణ సాహసయాత్ర ప్రారంభం కానుంది.
కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి
నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్ర చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. మాలో ఉండని కృషి, పట్టుదల మీలో ఉంటాయి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో మాటలు, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. వాటన్నింటిని అధిగమించి ఇక్కడి వరకు వచ్చారు. మనలో ఉన్న కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి.
సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించండి
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటాం. సపోర్ట్ చేస్తాం. మీలాంటి వారిని ప్రోత్సహిస్తే సమాజంలో కూడా మార్పు వస్తుంది. దీనిని నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. మా కుటుంబంలో కూడా ఒకరు సరిగా మాట్లాడటానికి తడబడేవారు. అనేక ఇబ్బందులు పడ్డారు. అతన్ని చాలామంది ఎగతాళి చేసేవారు. దేవుడు ప్రతి కుటుంబానికి ఓ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను జయించే శక్తి కూడా ఇస్తాడు. మీ అందరికీ ఆ శక్తి ఉంది. ప్రభుత్వం కూడా మద్దతుగా ఉంటుంది. సవాళ్లను అధిగమనించి ప్రపంచాన్ని జయించండి. సమాజం మిమ్మల్ని గౌరవించాలి. సొంత పిల్లల్లా చూసుకోవాలి. వ్యక్తిగా నేను ఆశించేది సమాజంలో మీరు తీసుకురావాలి.
ప్రతి ఏడాది మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఏడాది మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. నూతన ఆవిష్కరణలను సీఎం చంద్రబాబునాయుడు గారు కూడా ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఒకమాట చెప్పారు. అమ్మకు చెప్పలేని పని చేయవద్దని సూచించారు. దీనిని అందరూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక దశల్లో ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఎంతో మంది సాయం అందిస్తారు. నా జీవితంలో కూడా పలువురు ఉపాధ్యాయులు, రాజిరెడ్డి లాంటి ప్రొఫెసర్లు సాయం చేశారు. మనం కూడా సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి. మీ జీవితంలో కనీస 10 మందికి సాయపడాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చిన్నచూపు చూడాలంటే భయపడాలి. కసితో, పట్టుదలతో పనిచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య, దివ్యాంగులకు ప్రోత్సాహం, అభ్యసన ఫలితాలపై దృష్టిపెట్టామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను విద్యార్థులు విజయవంతంగా పూర్తిచేయాలని కోరుకుంటూ, వారిని అభినందిస్తూ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరితో కలిసి గ్రూఫ్ ఫోటో దిగారు.
మేం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలి
జి.విశ్వాస్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి(Visual Impairment)
పదో తరగతి, రామవరప్పాడు జడ్పీ హైస్కూల్
విజయవాడ
నేను పాఠశాల నుంచి ఇంటికి, ఇంటి నుంచి పాఠశాలకు మాత్రమే వెళ్లేవాడిని. ఏవైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్లేవాడిని కాదు. నా రూపు చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ బేస్ క్యాంప్ సెలక్షన్స్ జరుగుతున్నాయని మా టీచర్ చెబితే వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ అందించారు. అక్కడ నాలాంటి విద్యార్థులు పరిచయం అయ్యారు. ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అనంతరం లద్దాఖ్ వెళ్లాం. మేం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలి అనే కాన్ఫిడెన్స్ తో వెళ్లాం. మేం అక్కడ ట్రెక్కింగ్ చేశాం. మాలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది ముందుకు వస్తారు. నీకు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు కదా, నీ ఫ్రెండ్స్ ఎవరూ పట్టించుకోరు, నువ్వు ఎదగాలి అని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మున్ముందు మరింత మద్దతు అందించాలని కోరుకుంటున్నాను.
నీ కష్టమే నీకు విజయం తీసుకువస్తుంది
బి.సింధు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిని(Hearing Impairment)
ఇంటర్ ద్వితీయ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల, న్యూపేట్
చంద్రగిరి, తిరుపతి జిల్లా
నేను ఇల్లు, కాలేజీ తప్ప ఎక్కడికీ వెళ్లను. తిరుపతిలో సెలెక్షన్స్ ఉన్నాయని, ప్రయత్నించాలని మా భవిత స్కూల్ టీచర్లు శ్యామల, రాజేశ్వరి గార్లు చెబితే వెళ్లాను. నీ కష్టమే నీకు విజయం తీసుకువస్తుందని చెప్పారు. సెలెక్ట్ అయిన తర్వాత గండికోట తీసుకెళ్లారు. బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ సెక్యూరిటీ కూడా ఉంది. కాబట్టి మాకు సులభం అయింది. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ సమయంలో రోజూ బాగా నడిపించేవారు. వెళ్లిపోదాం అనుకున్నాను. కష్టం తర్వాతే ఫలితం ఉంటుందని సార్స్ చెప్పారు. లద్దాఖ్ లో మైనస్ 5 డిగ్రీల చలిలో ట్రెక్కింగ్ చేశాం. ఇప్పుడు అంతా బాగుంది. ఇలాంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
చేసి చూపిస్తానని చెప్పా
పి.రూప సాయిశ్రీ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిని(Hearing Impairment)
9వ తరగతి, గొల్లపాలెం జడ్పీ హైస్కూల్
గోరింట, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా
ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపడుతుండటం చాలా ఆనందంగా ఉంది. గండికోటలో బాగా శిక్షణ ఇచ్చారు. మొదట మా నాన్న వద్దని వచ్చేయమన్నారు. అమ్మ మాత్రం పట్టుపట్టింది. స్కూల్ ఫ్రెండ్స్ కూడా నువ్వు చేయలేవన్నారు. నేను చేసి చూపిస్తానని చెప్పా. మా గ్రూఫ్ ఫోటో చూసిన తర్వాత మా అమ్మ చాలా సంతోషించింది. లద్దాఖ్ చూసిన తర్వాత నా మైండ్ పోయింది. అక్కడి సుందర ప్రదేశాలు చాలా బాగున్నాయి. చలి వేసినా అందరూ ఉండటం వల్ల ముందుకుసాగాం. ఇలాంటి అవకాశం కల్పినందుకు ధన్యవాదాలు. నేను సెలెక్ట్ అయిన మా ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొట్టారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏఎస్ పీడీ కె.రవీంద్రనాథ్ రెడ్డి, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సీఈవో శేఖర్ బాబు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ పర్వతారోహకులు సాయిక్ హిమాన్షు, రఘునాథరెడ్డి, ఎం.పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags: Intense drive and determination are what shape us into great individuals.