ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
- ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
- ఏటా నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు
- మన ఘన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించే గొప్ప ప్రయత్నం
- వారసత్వ సంపదను భావితరాలకు విలువైన బహుమతిగా అందించే చొరవ
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే కొండపల్లి బొమ్మల మేళా ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేళాను ప్రతి సంవత్సరంనిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు.
కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కొండపల్లి బొమ్మల మేళాపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపల్లి బొమ్మలు రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంప్రదాయ కళలలో ఒకటని.. ప్రపంచ వారసత్వ దినోత్సవం అయిన ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కొండపల్లి బొమ్మల మేళాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మన కొండపల్లి బొమ్మను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, మన భావితరాలకు హస్తకళా వైభవాన్ని విలువైన బహుమతిగా అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక కళాకారులకు ఈ మేళా ద్వారా అన్ని విధాలా చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. మేళా సందర్భంగా వివిధ రకాల కొండపల్లి బొమ్మల ప్రదర్శనలు, అమ్మకాలు, కళాకారులతో ప్రత్యక్ష పరస్పర చర్యలు, మేధోమేధన చర్చలు వంటివి ఉంటాయన్నారు.
బ్రాండింగ్, కొత్త డిజైన్లు, ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటి వాటిపైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళా మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి, సంస్కృతి పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని.. ఈ మూడు రోజులు కొండపల్లి ప్రజలు సరికొత్త ఉత్సాహంతో పండగ వాతావరణంతో కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటా కొండపల్లి బొమ్మల పండగను జరుపుకోవాలని కోరారు. వారసత్వ సంస్కృతి, ఆధునిక జెన్ జెడ్, పండగలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై మార్చి 8న కొండపల్లి బొమ్మల పోటీ నిర్వహించడం జరిగిందని.. ఇందులోని విజేతలకు కొండపల్లి బొమ్మల మేళా కార్యక్రమం సందర్భంగా రూ. లక్ష విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం.. కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎ.శిల్ప, కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్‌టీఐహెచ్ విజయవాడ సీఈవో జి.కృష్ణన్, జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్, వివిధ శాఖల అధికారులు, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags: The Kondapalli Dolls Fair: A Grand Festival