తిరుపతి ముచ్చట్లు:
వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
మూడు రోజుల పాటు వైభవంగా వాహన సేవలు
జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా శ్రీనివాసమంగాపురంలోని ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షించి ఆలయాన్ని ఆధ్యాత్మికంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.
మూడు రోజుల పాటు దివ్య వాహన సేవలు
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
స్వామివారికి పరదాల విరాళం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మునికుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Srinivasa Mangapuram temple decked up for the Sakshatkara Vaibhavotsavams.