April 11, 2026
Explore
తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!

తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!

April 11, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది.

టీటీడీ గణాంకాల ప్రకారం.. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈ సంఖ్య 12,18,53,535గా ఉంది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే అదనంగా 1.76 కోట్ల లడ్డూల అమ్మకాలు పెరిగాయి. ఈ అమ్మకాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో టీటీడీకి సుమారు రూ. 567 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. అదనంగా లడ్డూలు కావాలనుకునే వారికి ఒక్కో లడ్డూను రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదం విక్రయాలు కూడా కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి.

Tags: Surging Demand for Tirumala Laddus… A New Record in Sales!