April 7, 2026
Explore
మాజీ భార్యపై దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.

మాజీ భార్యపై దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.

April 7, 2026 | Andhra Pradesh

👉ఆస్తి కోసం దంపతులపై దాడి చేసిన నిందితులకు శిక్ష ఖరారు.

👉తీర్పు వెలువరించిన మదనపల్లి ఏడవ అదనపు జిల్లా కోర్టు.

💠పోలీసుల చొరవను అభినందించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

ఆస్తి కోసం మాజీ భార్య మరియు ఆమె భర్తపై ప్రాణాంతక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మదనపల్లి ఏడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఆర్. శ్రీలత మంగళవారం తీర్పు వెలువరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో నిందితులకు శిక్ష పడింది.

కేసు వివరాల్లోకి వెళ్తే:
పుంగనూరుకు చెందిన ఎం. యేసు (A1) తన భార్య నీలిమతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం నీలిమ, వెంకటేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని నివసిస్తోంది. అయితే నీలిమ తల్లి ఆమె పేరున గుర్రంకొండ మండలంలో రాసి ఇచ్చిన ఆరు ఎకరాల పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని యేసు పథకం వేశాడు. ఈ క్రమంలో గతంలో ఒకరోజు నీలిమ, వెంకటేష్ దంపతులు చౌడేపల్లి నుంచి పలమనేరు వెళ్తుండగా, నిందితుడు యేసు తన స్నేహితులు టి. నాగరాజు (A2), ఎం. మునిరాజా (A3) లతో కలిసి వారిని అటకాయించాడు. వారిపై విచక్షణారహితంగా దాడి చేసి, చంపేస్తామని బెదిరించి తీవ్ర రక్తగాయాలు చేశారు. బాధితులు అతికష్టం మీద వారి నుంచి తప్పించుకుని 11.12.2022 వ తేదీన పోలీసులను ఆశ్రయించారు.

కోర్టు తీర్పు:
అప్పటి చౌడేపల్లి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేయగా, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ విభాగం ఈ కేసును నిరంతరం పర్యవేక్షించింది. విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువు కావడంతో.. నిందితులు A1, A2, A3 లకు ఐపిసి సెక్షన్ 324 కింద రెండేళ్లు, సెక్షన్ 506 కింద ఒక ఏడాది, సెక్షన్ 341 కింద ఒక నెల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని, వెరసి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.

అభినందనలు:
నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, (మదనపల్లి ఇంచార్జ్ డిఎస్పీ) కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ సీఐ కె. దస్తగిరి, చౌడేపల్లి ఎస్ఐ చిన్న రెడ్డప్ప, కోర్టు లైజన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్, ప్రాసిక్యూషన్ లో కీలక పాత్ర పోషించిన అదనపు పి.పి జి.ఎస్. శైలజ, కోర్టు హెడ్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి, కానిస్టేబుల్ నాగరాజులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. బాధితులకు న్యాయం జరగడంలో పోలీసులు చూపిన చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Three sentenced to two years in prison in case involving attack on ex-wife.