April 7, 2026
Explore
ఊరెళ్తున్నారా? దొంగల కన్ను పడకుండా జాగ్రత్త వహించండి!

ఊరెళ్తున్నారా? దొంగల కన్ను పడకుండా జాగ్రత్త వహించండి!

April 7, 2026 | Andhra Pradesh

💠వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి,

👉సోషల్ మీడియాలో పర్యటనల అప్‌డేట్స్ వద్దు.

👉నీటి వనరుల వద్ద పిల్లల పట్ల నిఘా ఉంచాలి.

మదనపల్లి ముచ్చట్లు:

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలతో కలిసి విహారయాత్రలకో, సొంతూళ్లకో వెళ్లడం అందరికీ అలవాటు. అయితే, మీరు ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయం కోసం దొంగలు అదను చూస్తుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆస్తులను రక్షించుకోవాలని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు. మంగళవారం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి పలు కీలక భద్రతా సూచనలు జారీ చేశారు.

మీ ఇల్లు భద్రంగా ఉండాలంటే..
ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ప్రధాన ద్వారంతో పాటు వెనుక తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఎస్పీ సూచించారు. “మేము ఫలానా ఊరు వెళ్తున్నాం.. ఇప్పుడు అక్కడ ఉన్నాం” అంటూ ఫేస్‌బుక్, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడంవల్ల మీఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని దొంగలకు మీరే చెప్పినట్లవుతుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఇంటి బయట ఒక లైటు వెలిగేలా ఏర్పాటు చేయాలని, పక్కింటి వారు లేదా నమ్మకస్థులకు సమాచారం ఇవ్వడం ద్వారా ఇంటిపై నిఘా ఉంటుందని తెలిపారు. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు.

పిల్లల భద్రత-తల్లిదండ్రుల బాధ్యత..
పరీక్షలు ముగిసి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కోరారు. సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన చెరువులు, బావులు, కాలువల వద్దకు వెళ్లకుండా చూడాలి. నీటి లోతు తెలియక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా చిన్నారులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పించాలి. సెలవుల్లో పిల్లలను ఆటపాటలు, కథల పుస్తకాలు లేదా సమ్మర్ క్యాంపుల వైపు మళ్లించి వారి సమయాన్ని సద్వినియోగం చేయాలి.

పోలీసులకు సహకరించండి..
జిల్లావ్యాప్తంగా పోలీసు నిఘాను పెంచామని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు అడిగే కాల్స్ నమ్మవద్దని హెచ్చరించారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags; Are you going out of town? Take precautions to keep your home safe from thieves!