April 6, 2026
Explore
ఏపీలో భిన్న వాతావరణం…ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

ఏపీలో భిన్న వాతావరణం…ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

April 6, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర – పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో.. మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది.

ఎండలు మండుతున్నాయి

రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 41.8, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 41.5, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41.3, చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags: Varied Weather in AP: Sunshine on One Side, Rains on the Other.