💠‘ప్రీ వై-ఫై’ ప్రమాదాలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక.
👉సోషల్ మీడియాలో పుకార్లొద్దు.. బాధ్యతగా ఉండండి. – జిల్లా ఎస్పీ.
మదనపల్లె ముచ్చట్లు:
ఆధునిక కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి , ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉచితంగా లభించే వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా కొత్త రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, వీటి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉచిత వై-ఫైతో డేటా చోరీ!
కాఫీ షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో లభించే ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. “ప్రీ వై-ఫై” పేరుతో జరుగుతున్న ఈ కొత్త రకమైన ఫిషింగ్ దాడుల ద్వారా మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని, మాల్వేర్ ద్వారా డేటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించారు. పబ్లిక్ వై-ఫై వాడుతున్నప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ చేయవద్దు. అపరిచిత వై-ఫై హాట్‌స్పాట్‌లకు ఫోన్లను కనెక్ట్ చేయకపోవడమే శ్రేయస్కరం. ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లతో పాటు ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
లింకులు క్లిక్ చేస్తే.. నిధులు మాయం!
ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే అపరిచిత లింకులను నమ్మి క్లిక్ చేయవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. పథకాల దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని, ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ లేదా పిన్ నంబర్లు పంచుకోవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సోషల్ మీడియా లో.. జాగ్రత్త!
సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రతి వార్తను నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేయవద్దు. అది సమాజ శాంతికి భంగం కలిగించేలా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం.
అపరిచితులతో స్నేహం వద్దు:
ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా వచ్చే రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు. ఆకర్షణీయమైన మాటలకు లోబడి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపించి ఇబ్బందుల్లో పడవద్దు.
చట్టపరమైన చర్యలు:
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సైబర్ నేరాల రహిత అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దడంలో పోలీసులకు సహకరించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు.
Tags:Don’t fall into the ‘free’ trap set by cyber fraudsters!