March 9, 2026
Explore
ఏపీలో మహిళలకు చంద్రబాబు వరాలు

ఏపీలో మహిళలకు చంద్రబాబు వరాలు

March 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ట్రిపుల్ బెడ్‌రూమ్‌లు

పింఛన్లు, 60 కిలోల రేషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో పెరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మహిళలకు వరాలు ప్రకటించారు.
అలాగే సీఎం సమక్షంలో పలు సంస్థలతో మెప్మా (పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ), సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) పలు ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు డ్వాక్రా మహిళలకు మిల్లెట్‌ కార్టులు, ఎగ్‌ కార్టులు, ఫార్మ్‌ బజార్‌ వ్యాన్లను పంపిణీ చేశారు. ‘ఏపీ పోలీస్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌’ వెబ్‌సైట్‌ను, వ్యవసాయ యంత్రాల బ్యాంకును కూడా చంద్రబాబు ప్రారంభించారు. అంతేకాదు డ్వాక్రా మహిళల కోసం సూపర్‌ నారీ యాప్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే వివిధ నిర్మాణాలకు సభాప్రాంగణం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునిరూ.10,100 కోట్ల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు.

ఏపీలో మహిళలకు చట్టసభల్లో త్వరలోనే 33% రిజర్వేషన్‌ రాబోతోంది అన్నారు చంద్రబాబు. మహిళలు ఎమ్మెల్యేలుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని.. ఏడాదిలో లక్షమందిని తయారు చేశామని, వచ్చే మహిళా దినోత్సవం నాటికి మరో ఐదు లక్షల మందిని తయారుచేస్తామని చెప్పుకొచ్చారు. ‘అర్హులందరికీ అదనపు పింఛన్లు, డబుల్, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు (ఇంట్లో ఐదారుగురు ఉంటే ట్రిపుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు కట్టించి ఇస్తాం), ఇతర సంక్షేమ పథకాలతో పాటు 60 కిలోల వరకు రేషన్‌ బియ్యం అందిస్తాము. స్వయం ఏపీ ఉత్పత్తులకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అవుతాను.. ప్రపంచవ్యాప్త మార్కెటింగ్‌ చేస్తాను. స్వయం ఏపీని గ్లోబల్‌ బ్రాండ్‌గా మార్చే బాధ్యతు తీసుకుంటా’ అన్నారు ముఖ్యమంత్రి.

‘రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాము.. ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున అందించాము. అలాగే స్త్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. ఇప్పటివరకు 50 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారు. మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. సిలిండర్‌ రేటు మార్కెట్‌ఋలో పెరిగినా ఆడబిడ్డలకు 3 సిలిండర్లు ఉచితంగానే అందిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పీ4 ద్వారా మొత్తం 10 లక్షల బంగారు కుటుంబాలకు సంబంధించి లక్ష మంది మార్గదర్శుల ద్వారా సాయం అందిస్తున్నాము. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో రాజీపడం.. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను తయారు చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేలది లేదు.. వారికి అదే చివరి రోజు అవుతుంది. మహిళలు రుద్రమదేవిలా పోకిరీలు, రౌడీల తాట తీయాలి’ అన్నారు చంద్రబాబు.

Tags:Chandrababu’s blessings for women in AP