తిరుపతి ముచ్చట్లు:
నవంబరు 27 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు రుద్రయాగం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో లోకకల్యాణం, భక్తుల శ్రేయస్సు కాంక్షిస్తూ నెల రోజుల పాటు నిర్వహిస్తున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం గురువారం వైభవంగా ముగిసింది.
నవంబరు 18వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఈ చండీయాగం ముగింపు సందర్భంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో చండీహోమ సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవిరాట్టుకు కలశాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారికి కలశస్థాపన, విశేష పూజలు, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నవంబరు 27 నుంచి రుద్రయాగం
నెల రోజుల హోమ మహోత్సవాల్లో తదుపరి ఘట్టంగా నవంబరు 27 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి రుద్రయాగం నిర్వహించనున్నారు.
ఈ యాగంలో గృహస్తులు రూ.500 చెల్లించి టికెట్ కొనుగోలు ద్వారా ఒక రోజు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. యాగంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
Tags:Chandi Yagam concludes on a grand scale at the Sri Kapileswara Swamy Temple