March 9, 2026
Explore
జిల్లా చరిత్రలో సుగుటూరు వంశస్తుల పాలన కీలకం

జిల్లా చరిత్రలో సుగుటూరు వంశస్తుల పాలన కీలకం

March 9, 2026 | Uncategorized

పుంగనూరుముచ్చట్లు:

జిల్లా చరిత్రలో పుంగనూరు జమీందారులు సుగుటూరు వంశస్తులు కీలకపాత్ర పోషించారు. పుంగనూరు జమీందారి పాలన పలమనేరు , సదుం, మదనపల్లె వరకు కొనసాగింది. తొలి సారిగా క్రీ.శ.600 సంవత్సరాల నుంచి జమీందారి పాలన ఇటు కర్ణాటక, గుర్రంకొండ వరకు సుగుటూరు వంశస్తులు సుమారు 700 గ్రామాలను తమ పరిధిలో ఉంచుకుని పరిపాలన సాగించారు. సుగుటూరు వంశస్తులైన రణబైరేగౌడు అనే వ్యక్తి తొలి సారిగా కర్నాటకలో ఉన్న సుగుటూరు ప్రాంతాన్ని పాలించేవారు. అక్కడి నుంచి అంచలంచలుగా సుగుటూరు వంశస్తులు పుంగనూరులో వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. జమీందారి వ్యవస్థ రద్దు కాబడినా నేటికి పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర జమీందారి పాలనను గుర్తు చేస్తూ , జమీందారి పాలన సాంప్రదాయ రీతిలో సుగుటూరు వంశస్తులు రాణి సుందరమ్మణి, సోమశేఖర చిక్కరాయులు, మల్లికార్జున చిక్కరాయల ఆధ్వర్యంలో ఎంతో వేడుకగా సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారు. 600 సంవత్సరాల నుంచి 1949 వరకు ఏకదాటిగా సుగుటూరు వంశస్తులు పాలన కొనసాగించారు. వేలాది ఎకరాల భూములను ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇనాములుగా ప్రకటించి అందజేశారు. చెరువులు, అనేక ఆలయాలు నిర్మించి, జిల్లా రాష్ట్ర చరిత్రలో పుంగనూరు జమీందారుల పాలన స్థిరస్థాయిగా నిలిచింది. జమీందారుల పాలనలో బ్రిటిష్‌ ప్రభువులు, సుల్తానులు పర్యటించి, జమీందారుల పాలనను ప్రశంసించారు. అలాగే ఎంతో మంది మేధావులు జమీందారులకు ముఖ్య సలహాదారులుగా పని చేశారు. పుంగనూరుకు వచ్చే వారికి ఏనుగు అంబారిపై స్వాగతం పలికేవారు. అలాంటి పాలన అందించిన జమీందారులకు నేడు ప్యాలెస్‌, ఆవరణం మినహా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడం గమనార్హం. ప్రతి ఏటా మార్చి నెల ఆఖరులో జరిగే సుగుటూరు గంగమ్మ జాతరకు మాత్రం జమీందారులు బెంగళూరు నుంచి వచ్చి వెళుతారు.

Tags; The rule of the Sugutur dynasty is crucial in the history of the district.