November 25, 2026
Explore
విపత్తులను ఎదుర్కొనేలా… నాయకులుగా ఎదిగేలా…

విపత్తులను ఎదుర్కొనేలా… నాయకులుగా ఎదిగేలా…

November 25, 2026 | Andhra Pradesh

  • విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు స్కౌటింగ్ దోహదం
  • స్కౌట్ మాస్టర్లకు విజయవంతంగా ముగిసిన ఏడు రోజుల శిక్షణ

మదనపల్లె ముచ్చట్లు:

విపత్తులను ధైర్యంగా ఎదుర్కొనే స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను పెంపొందించడంలో స్కౌటింగ్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమిషనర్ డాక్టర్ కె. సుబ్రమణ్యం పేర్కొన్నారు.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఏడు రోజుల బేసిక్, అడ్వాన్స్‌డ్ స్కౌట్ మాస్టర్ల శిక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది.

ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు సర్వధర్మ ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఓపెన్ సెషన్‌లో శిక్షణార్థులు తమ శిక్షణా అనుభవాలను, నేర్చుకున్న నైపుణ్యాలను, శిక్షణ ద్వారా పొందిన అవగాహనను పరస్పరం పంచుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లీవ్ టేకింగ్ సెరిమనీ నిర్వహించి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె. సుబ్రమణ్యం మాట్లాడుతూ స్కౌటింగ్ అనేది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదని, విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప ఉద్యమమని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో స్కౌటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అందించి, వారిని విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగేలా, సమాజానికి సేవ చేసే నాయకులుగా తీర్చిదిద్దాలని సూచించారు.

శిక్షణలో భాగంగా అనపగుట్టలో నిర్వహించిన ట్రెక్కింగ్ కార్యక్రమం ఉపాధ్యాయుల్లో సాహస స్ఫూర్తి, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించిందని జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పాఠశాలల్లో స్కౌటింగ్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు అందించగలిగామని పేర్కొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమానికి బేసిక్ కోర్సు లీడర్‌గా కె. శివప్రసాద్, అడ్వాన్స్‌డ్ కోర్సు గ్రూప్-ఎ కు డాక్టర్ కె. కమల కన్నన్ (స్టేట్ ట్రైనింగ్ కమిషనర్, తమిళనాడు), గ్రూప్-బి కి జి. వెంకటేశ్వర్లు శిక్షణ అందించారు.

Tags; To face disasters… to grow into leaders…