November 23, 2026
Explore
తండ్రి వారసత్వం నుంచి మేయర్ పీఠం వరకు!

తండ్రి వారసత్వం నుంచి మేయర్ పీఠం వరకు!

November 23, 2026 | Andhra Pradesh

ఒడిదుడుకుల ప్రస్థానం.. ప్రజాభిమానమే అసలైన సవాలు!

విజయవాడ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తారా?

విజయవాడ ముచ్చట్లు:

వంగవీటి కుటుంబానికి విజయవాడ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. దివంగత వంగవీటి మోహనరంగా ప్రజా నాయకుడిగా సంపాదించుకున్న గుర్తింపు, రాజకీయ వారసత్వం ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు బలమైన పునాదిగా నిలిచాయి. అయితే ఆ వారసత్వాన్ని తన రాజకీయ విజయాలుగా మలచుకునే క్రమంలో ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తాజాగా విజయవాడ నగర మేయర్‌గా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది.

పాతికేళ్లకే ఎమ్మెల్యేగా..

మోహనరంగా 1981లో విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా, 1985లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఆయన హత్యకు గురికావడంతో భార్య రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చి 1989, 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కుటుంబ రాజకీయ నేపథ్యంతో ఎదిగిన రాధాకృష్ణ 2003లో కాంగ్రెస్‌లో చేరి, 2004లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పరాజయాలు.. పార్టీ మార్పులు

2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి 2014లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

వరుస ఎన్నికల పరాజయాలు, రాజకీయ పార్టీలు మారడం, దీర్ఘకాలం చట్టసభలకు దూరంగా ఉండటం ఆయన రాజకీయ ప్రయాణంపై విమర్శలకు కారణమయ్యాయి. తండ్రి సంపాదించుకున్న రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడంలో రాధాకృష్ణ వెనుకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

జనసేనలో చేరిక.. మేయర్‌గా విజయం

2026 అక్టోబరులో జనసేనలో చేరిన రాధాకృష్ణ, విజయవాడ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. నవంబరు 1న జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై 1,30,872 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నవంబరు 7న రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్‌లో ఆయన ఎన్నికను ప్రకటించింది.

నేడు మేయర్‌గా ప్రమాణ స్వీకారం

విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ నేడు (నవంబరు 23) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో జరిగే కార్యక్రమంలో ఆయనతోపాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు కూడా ప్రమాణం చేయనున్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. తండ్రి ఒకప్పుడు విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించగా, కుమారుడు అదే నగరానికి మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆసక్తికర పరిణామం.

ప్రజాభిమానాన్ని నిలబెట్టుకోవడమే అసలైన పరీక్ష!

ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠాన్ని అధిష్ఠించడం ఒక ఎత్తయితే, ప్రజలు నమ్మకంతో వేసిన ఓట్లను, అభిమానాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. విజయవాడ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలంటే రాధాకృష్ణ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వర్షాకాలపు ముంపు నివారణ, రహదారులు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి. పేదలు, మహిళలు, వృద్ధులు, వీధి వ్యాపారుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కృష్ణానది పరిసరాల పరిశుభ్రత, పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలి.

అందరికీ అందుబాటులో ఉండే పాలన అవసరం

తనకు ఓటు వేసిన వారితోపాటు ఓటు వేయని ప్రజలకూ సమానంగా సేవలందించాలి. అన్ని పార్టీల కార్పొరేటర్లను కలుపుకొని నగరాభివృద్ధికి కృషి చేయాలి. ప్రతి డివిజన్‌లో ప్రజలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను తెలుసుకోవాలి. అభివృద్ధి పనుల ఖర్చు, నాణ్యత, పురోగతిపై పారదర్శకత పాటించాలి. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు విధించాలి.

తండ్రి పేరు వారసత్వం.. తన పనితీరే గుర్తింపు!

మోహనరంగా ప్రజల మధ్య సంపాదించుకున్న గుర్తింపు ఆయన సేవలు, ప్రజలతో అనుబంధం ద్వారా ఏర్పడింది. ఆ వారసత్వాన్ని గౌరవిస్తూనే రాధాకృష్ణ తనదైన పరిపాలనా శైలిని చాటుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక అవకాశం మాత్రమే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. మేయర్ పీఠం కంటే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం గొప్ప విషయం. విజయవాడ అభివృద్ధిలో రాధాకృష్ణ ఎలాంటి ముద్ర వేస్తారు? తండ్రి రాజకీయ వారసత్వాన్ని తన పనితీరుతో ఎలా ముందుకు తీసుకెళ్తారు? అన్నది రాబోయే కాలమే నిర్ణయించనుంది.

Tags; From a father’s legacy to the mayor’s chair!