ఉరవకొండ ముచ్చట్లు:
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పట్ల ఇదేనా గౌరవం..? | ఉరవకొండ, గణేవారిపల్లిలో వెలుగుచూసిన నిర్లక్ష్యం | ఉన్నతాధికారులు స్పందించాలి
ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు రాత్రింబవళ్లు విధుల్లో మునిగిపోయే పోలీసులకు అందించే భోజనాల విషయంలో ఇంతటి నిర్లక్ష్యమా..? ప్రజల భద్రత కోసం తమ కుటుంబాలను పక్కనపెట్టి, పగలు రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి భోజనాలు తరలించేందుకు చెత్త వాహనాలే దిక్కయ్యాయా..? తడి చెత్త, పొడి చెత్త సేకరించి తరలించే వాహనాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు భోజనాలు పంపిన దృశ్యాలు తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.
ఉరవకొండ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి చెత్త సేకరణ వాహనాల్లో భోజనాలు పంపిన ఘటన పోలీసుల పట్ల అధికార యంత్రాంగం చూపుతున్న చులకన వైఖరికి అద్దం పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి రూరల్ మండలం గణేవారిపల్లిలోనూ ఇదే తరహాలో భోజనాలు పంపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న తీరును స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల విధులంటే పోలీసులకు కేవలం బందోబస్తు మాత్రమే కాదు.. గంటల తరబడి నిలబడటం, జనసందోహాన్ని నియంత్రించడం, ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవడం, రాత్రి వేళల్లోనూ అప్రమత్తంగా ఉండటం. ఈ క్రమంలో కనీస భోజన సౌకర్యం కల్పించడం అధికారుల బాధ్యత. కానీ భోజనాల తరలింపునకు చెత్త వాహనాలను వినియోగించడం ఏ విధంగా సమర్థించుకుంటారు? ఆ వాహనాల్లో ఆహార పదార్థాలను తరలించడం పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? పోలీసులకు భోజనాలు అందించే విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులు ఏం పర్యవేక్షించారు?
పోలీసుల సేవలు కావాలి.. వారి గౌరవం మాత్రం అక్కర్లేదా?
ఎన్నికల సమయంలో పోలీసుల సేవలను వినియోగించుకునే యంత్రాంగం, వారికి కనీస గౌరవప్రదమైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైతే అది పరిపాలనా నిర్లక్ష్యమే. పోలీసుల శ్రమను గుర్తించాల్సిన అధికారులు, భోజనాల సరఫరా విషయంలోనూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా కనిపిస్తోంది.
ఇది చిన్న పొరపాటుగా కొట్టిపారేయాల్సిన వ్యవహారం కాదు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఆహారం అందించే ఏర్పాట్లపై స్పష్టమైన బాధ్యత, పర్యవేక్షణ ఉండాలి. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి, భోజనాలు ఏ వాహనాల్లో, ఎవరి ఆదేశాలతో తరలించారో నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
పోలీసుల త్యాగాలను ప్రసంగాల్లో కొనియాడుతూ.. ఆచరణలో చెత్త వాహనాల్లో భోజనాలు పంపే పరిస్థితి ఉంటే, అది పోలీసు సేవలకు ఇచ్చే గౌరవం కాదు.. వారి ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యవహారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కళ్లు తెరవాల్సిందే!
Tags: Meals for police transported in garbage vehicles!