అన్నమయ్య జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి హెచ్. డొనప్ప
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 25వ తేదీ బుధవారం విశాఖపట్నంలో అంతర్జాతీయ ఉద్యోగ నియామక మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి హెచ్. డొనప్ప తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు శిక్షణ శాఖ సహకారంతో ఈ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని కంచరపాలెం, పాత ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న ప్రభుత్వ ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ఈ మేళా ద్వారా వివిధ అంతర్జాతీయ సంస్థల్లో మొత్తం 347 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో నర్సింగ్ విభాగంలో 96, హాస్పిటాలిటీ మరియు ఫుడ్ ప్రాసెసింగ్‌లో 39, ఇంజినీరింగ్ మరియు ఆటోమోటివ్‌లో 27, మైనింగ్ మరియు లాజిస్టిక్స్‌లో 22, సివిల్ ఇంజినీరింగ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో 13, ఆరోగ్య సంరక్షణ విభాగంలో 150 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు వివరించారు.
నర్సులు, పెయింటర్లు, ప్లంబర్లు, చెఫ్‌లు, కుక్స్, బేకర్లు, కిచెన్ హెల్పర్లు, వెయిటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటోమొబైల్ టెక్నీషియన్లు, ట్రక్ డ్రైవర్లు, క్రేన్ మరియు ఇతర పరికరాల ఆపరేటర్లు, సివిల్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, సూపర్వైజర్లు తదితర పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
బహ్రెయిన్, గ్రీస్, కేప్ వెర్డే, గల్ఫ్ దేశాలు, యూకే, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, నర్సింగ్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. సంబంధిత రంగాల్లో అనుభవం ఉన్నవారితో పాటు నూతనంగా విద్య పూర్తి చేసిన అభ్యర్థులు కూడా తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని వివరించారు.
కావున, అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి హెచ్. డొనప్ప కోరారు.
మరిన్ని వివరాలు మరియు నమోదు కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
9988853335, 8712655686, 8790118349, 8790117279.
Tags;International job fair in Visakhapatnam on the 25th.