సంబేపల్లి ముచ్చట్లు:
సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సాఫ్ట్వేర్ ఉద్యోగి వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి
పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా..
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,చిన్నమండెం జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ల సహకారంతో గ్రామ రూపురేఖలు మారుస్తా..
సంబేపల్లి మండలం మోటకట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగి వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.సంబంధిత అధికారుల నుండి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు డిక్లరేషన్ ఫాం ను అందుకున్నారు.ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్‌గా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన గ్రామంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.పార్టీలకతీతంగా, కులమతాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డిల సహకారంతో మోటకట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పనిచేస్తానని తెలిపారు.సర్పంచ్‌గా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Tags: The development of Motakatla is the goal; I will transform it into a model village.