November 20, 2026
Explore
పుస్తక పఠనంతో మానసిక వికాసం, జ్ఞాపకశక్తి పెంపు

పుస్తక పఠనంతో మానసిక వికాసం, జ్ఞాపకశక్తి పెంపు

November 20, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలది కీలక పాత్ర
– టిటిడి డీఈవో డా. ఏవీఎన్ శివకుమార్

గ్రంథాలయం సమాచారం, విజ్ఞానం, వివేకాన్ని అందించే జ్ఞాన నిధి : శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకటరత్నం

పుస్తక పఠనం మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని టిటిడి డీఈవో డా. ఏవీఎన్ శివకుమార్ పేర్కొన్నారు. నిరంతర పఠనం ద్వారా మెదడు చురుకుదనం పెరుగుతుందని, కొత్త పదాలు, విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడులోని నాడీకణాలు ఉత్తేజితమవుతాయని తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం తిరుపతిలోని టిటిడి శ్వేత భవనంలో గల శ్రీ వెంగమాంబ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, పుస్తక పఠనం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే మతిమరుపు సమస్యలను నివారించడంలో కూడా తోడ్పాటు లభిస్తుందన్నారు. యువతలో పఠనాసక్తిని పెంపొందించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రంథాలయ వారోత్సవాల్లో పుస్తక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు టిటిడి గ్రంథాలయాలను విద్యార్థులకు మరింత చేరువ చేయడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గ్రంథాలయాల ఆధునీకరణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

గ్రంథాలయం విజ్ఞానంతో పాటు వివేకాన్ని పెంపొందించే వేదిక: శ్వేత డైరెక్టర్

శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకటరత్నం మాట్లాడుతూ, గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాకుండా సమాచారం, విజ్ఞానం, వివేకాన్ని అందించే జ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. “సమాచారం మనకు విషయాలను తెలియజేస్తుంది. విజ్ఞానం వాటిని అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది. వివేకం వాటిని సరైన రీతిలో ఉపయోగించుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ మూడింటినీ సమన్వయం చేసే అద్భుతమైన వేదిక గ్రంథాలయం” అని వివరించారు. పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని, విజ్ఞానం ద్వారా వివేకం అలవడుతుందని, వివేకంతో వ్యక్తిత్వం వికసిస్తుందని, వికసించిన వ్యక్తిత్వాలే సమాజ అభివృద్ధికి పునాదులవుతాయని తెలిపారు.

విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం వంటి విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవాలని పిలుపునిచ్చారు. “ఒక పుస్తకం చదివే వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోగలడు. గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విద్యార్థి తన భవిష్యత్తును నిర్మించుకోగలడు. తాను సంపాదించిన విజ్ఞానాన్ని సమాజంతో పంచుకునే వ్యక్తి సమాజ భవిష్యత్తుకు మార్గదర్శకుడు కాగలడు” అని అన్నారు.

గ్రంథాలయ వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. బహుమతులు గెలుచుకున్న వారే విజేతలు కాదని, పోటీల్లో పాల్గొని కొత్త విషయాలను నేర్చుకున్న ప్రతి విద్యార్థి నిజమైన విజేతేనని పేర్కొన్నారు.

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పుస్తక ప్రసాదం అందజేత

అనంతరం ‘గ్రంథాలయం – జీవితానికి మార్గదర్శకం (Library – A Guide to Life)’ అనే అంశంపై తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించిన వ్యాసరచన, సనాతన ధర్మంపై క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పంచగవ్య గిఫ్ట్ ప్యాకెట్లు, అగరబత్తీల ప్యాకెట్లు, ఐదు రకాల పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం, పుస్తక ప్రసాదం అందించారు.

అంతకుముందు జ్యోతి ప్రజ్వలన, పూజా కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. టిటిడి లైబ్రరీ ఇన్‌ఛార్జి డా. బాలాజీ దీక్షితులు వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ ఓఆర్ఐ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. టి. రాజశేఖర్, ఐటీ జీఎం సందీప్, శ్వేత ఏఈవో అరుణదేవి, సూపరింటెండెంట్ సుశీల, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:Mental development and memory enhancement through book reading