ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గకుండా.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
సూక్ష్మ నీటిపారుదల కింద వారానికి 600 హెక్టార్ల లక్ష్యం సాధించాలి
ప్రైమరీ సెక్టార్ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోకుండా వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన పంటలు, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్ధక, మత్స్య, సహకార, వ్యవసాయ మార్కెటింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో నీతి హాలులో జాయింట్ కలెక్టర్ మరియు ప్రైమరీ సెక్టార్ పరిధిలోని వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పురోగతి, లక్ష్యాల సాధన, పెండింగ్ పనులు, రైతులకు అందిస్తున్న సేవలపై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు.
వ్యవసాయ రంగంపై సమీక్ష
ఎల్‌నినో పరిస్థితుల కారణంగా జిల్లాలో సాధారణ రబీ సాగు విస్తీర్ణం 28,476 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 52 శాతం మేర 14,699 హెక్టార్లలో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ-క్రాప్ నమోదులో ఇప్పటివరకు 51 శాతం పురోగతి సాధించారని, నిర్దేశిత గడువులోగా 100 శాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఖరీఫ్ 2026లో మొత్తం 17,12,377 భూ కమతాలకు గాను 17,09,697 కమతాలు (99.8 శాతం) నమోదు చేసినట్లు అధికారులు వివరించారు.
అదేవిధంగా APAIMS రైతు యాప్‌లో ఇప్పటివరకు 85,656 మంది రైతులు నమోదు చేసుకున్నారని, నమోదు మరియు లాగిన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ (APFR) కింద పీఎం కిసాన్ లబ్ధిదారులు 1,72,569 మంది 78.7 శాతం మేర నమోదు అయ్యారని, దీన్ని వందశాతం ప్రగతి పూర్తి చేయాలన్నారు. చౌడేపల్లె, పీలేరు మండలాల్లో తక్కువ పురోగతికి గల కారణాలను గుర్తించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పంట సాగుదారుల హక్కు కార్డుల (CCRC) జారీలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 20లోగా ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జిల్లాలో గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా బీడుగా ఉన్న సుమారు ఆరు లక్షల ఎకరాల భూముల అంశంపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. వెబ్‌ల్యాండ్‌లో యజమానుల వివరాలు నమోదై ఉండి సాగుకు అనుకూలంగా ఉన్న భూములను గుర్తించి సాగులోకి తీసుకువచ్చేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇప్పటివరకు 8,915.34 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు.
బోర్ల కింద అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతు సేవా కేంద్రాలను గుర్తించి, అక్కడి రైతులకు ఉద్యాన పంటలు, పప్పుధాన్యాల సాగుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాలను సందర్శించాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు.
జిల్లాలో టమాటా పంట 16,917 హెక్టార్లలో సాగవుతున్నట్లు అధికారులు వివరించారు. ఇందులో 2026-27 ఖరీఫ్‌లో 10,477 హెక్టార్లలో సాగు నమోదైనట్లు తెలిపారు. నవంబరు రెండవ వారం నాటికి మార్కెట్లో టమాటా ధర కిలో రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నట్లు వివరించారు.
తోతాపురి మామిడి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద 2,714 మంది రైతుల నుంచి 28,025 మెట్రిక్ టన్నుల పంటను సేకరించి, కిలోకు రూ.4 చొప్పున రూ.1,120.98 లక్షల సహాయక మొత్తాన్ని అందించినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఉద్యాన పంటలకు సంబంధించి ఈ-క్రాప్ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్ల పురోగతిని సమీక్షించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం త్వరితగతిన ఫ్రూట్ కవర్ల టెండర్లు ఫైనలైజ్ చేసి, రైతులకు సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సూక్ష్మ నీటిపారుదల కింద అక్టోబరు నెలాఖరు వరకు 3,190 హెక్టార్లలో 2,792 పథకం అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకను 10,483 హెక్టార్లకు రైతులు డ్రిప్పు పరికరాల కొరకు నమోదు చేసుకున్నట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రతి వారం కనీసం 600 హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదల పనులు పూర్తి చేసేలా మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. నీరు నిండిన చెరువుల వివరాలను నీటిపారుదల శాఖ నుంచి సేకరించి, ఆయా ప్రాంతాల్లో రైతులను సూక్ష్మ నీటిపారుదల పథకంలో నమోదు చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగు తగ్గే పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా పశుసంవర్ధక కార్యకలాపాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాడి పశువుల సంఖ్య పెంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అధికారులతో చర్చించారు. తొలిదశలో నియోజకవర్గ స్థాయిలో వీటి ఏర్పాటుకు అవసరమైన భూములను నిబంధనల ప్రకారం కేటాయించాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు.
వెలిగల్లు రిజర్వాయర్‌లో 2026-27 సంవత్సరానికి ఇప్పటివరకు 71 లైసెన్సులు జారీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించి రూ.43,655 ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని మొత్తం 29 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సంఘాల్లో మొత్తం 69,246 మంది సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల ఈ-కేవైసీ చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
వ్యవసాయం, ఉద్యానవనం, సూక్ష్మ నీటిపారుదల తదితర ప్రాథమిక రంగాలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి శాఖ తన పరిధిలోని పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పెండింగ్ అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Tags: The e-crop and farmer registration process must be completed within the stipulated deadline.