November 11, 2026
Explore
పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

పారిశ్రామిక రాయితీలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

November 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


ఏపీలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం : సీఎం చంద్రబాబు
జపాన్ రాయబారి కెయిచీ ఓనోతో సీఎం చర్చ
విశాఖపట్నం, నవంబరు 11: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పారదర్శకమైన రాయితీల విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమలకు అందించే రాయితీల కోసం ఎస్క్రో అకౌంట్ విధానాన్ని తీసుకొచ్చామని, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నంలో జపాన్ రాయబారి కెయిచీ ఓనోతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, కీలక ఖనిజాలు, ఉక్కు పరిశ్రమ, గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. ఈ దిశగా జపాన్ సంస్థలు సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జపాన్ ప్రతినిధులు రాష్ట్రంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాలో భాగస్వామ్యం


జపాన్‌కు రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాను స్థిరంగా కొనసాగించే అంశాన్ని జపాన్ ప్రతినిధులు ప్రస్తావించారు. కీలక ఖనిజాల సరఫరాలో భారత్–జపాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సహకారం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే, ఆర్సెల్లార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు ప్లాంట్‌‌కు సంబంధించి తుది దశ ప్రాసెసింగ్‌కు అవసరమైన సెమీ ఫినిష్డ్ ఉత్పత్తులను జపాన్‌లోని మాతృసంస్థ నుంచి నిరాటంకంగా దిగుమతి చేసుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే అమార్ఫస్ మెటల్‌ను దేశంలో తొలిసారిగా తయారు చేయాలని ప్రొటీరియల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక రాయితీలతో 2026 డిసెంబరులో శ్రీసిటీలో ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.


విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్


భారతీయ నిపుణుల ప్రతిభను వినియోగించుకుంటూ, భారత్–జపాన్ సహకారంతో ఈ ఏడాది విశాఖపట్నంలో కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రారంభించినట్లు జపాన్ ప్రతినిధులు తెలిపారు. భారతీయ నిపుణుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు కాకినాడ నుంచి ఐదేళ్ల పాటు ఏటా సుమారు 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియా కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన జెరా సంస్థ, ఏఎం గ్రీన్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. భారత్–జపాన్ మధ్య గ్రీన్ అమ్మోనియా సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు.

Tags:Special emphasis on industrial incentives and skill development