November 11, 2026
Explore
రతన్ టటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహిస్తున్నాం

రతన్ టటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహిస్తున్నాం

November 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


ఆవిష్కరణలకు మరింత ప్రొత్సాహాన్నిచ్చేలా వరల్డ్ ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సహకారించాలి
స్టార్టప్‌లకు మేధో సంపత్తి హక్కులపై WIPO ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు
విశాఖపట్నం, నవంబర్ 11: ఆవిష్కరణలు, పరిశోధన, సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, రాష్ట్రంలోని స్టార్టప్‌లు-పారిశ్రామికవేత్తలకు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్-WIPO డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో సమావేశమయ్యారు. గురువారం నుంచి రెండు రోజుల పాటు సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. నోవోటెల్ హోటల్లో వరుస సమావేశాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా సీఎం చంద్రబాబు WIPO డీజీతో భేటీ అయ్యారు. WIPO–ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఏర్పాటు, భాగస్వామ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు మేధో సంపత్తి హక్కులు (IPR), పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాన పరిరక్షణపై శిక్షణ అందించే అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలోని చేనేత, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (GI Tag) సాధించడం, ఇప్పటికే గుర్తింపు పొందిన ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ, వాటి నాణ్యత-బ్రాండింగ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అంశాలపై WIPO సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు సహకరిస్తున్నామని తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రొత్సాహాన్నిచ్చేలా… రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని WIPO ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.


స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతమే లక్ష్యం


WIPO డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీల గురించి చర్చించారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం సదస్సులు అద్భుతంగా నిర్వహిస్తున్నారని డారెన్ టాంగ్ చంద్రబాబుతో అన్నారు. అనేక రంగాల్లో ప్రముఖులను, ప్రముఖ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం మంచి పరిణామమని… దీని వల్ల వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై అందరికీ అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ఇప్పటికే ఏపీలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి విన్నామని… క్వాంటం టెక్నాలజీని ప్రొత్సహించడంలో ఏపీ ముందు వరుసలో ఉందని… అమరావతి క్వాంటం గురించి కూడా తమకు అవగాహన ఉందని డారెన్ టాంగ్ ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. ఏపీని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టినట్టు సీఎం చంద్రబాబు డారెన్ టాంగ్‌కు వివరించారు. క్వాంటం, ఏఐ వంటి టెక్నాలజీలను అందిపుచ్చుకునేలా ఏపీ యువతను సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రైవేటు రంగంతో పాటు.. పాలనలో కూడా టెక్నాలజీని వినియోగించడం ద్వారా ప్రగతి సాధించడంతోపాటు… ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరంగా అందించేలా చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, క్వాంటం, నాచురల్ ఫార్మింగ్ సహా అనేక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని… 10 లక్షల మంది మహిళలను వ్యాపార వేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. స్థానికంగా మహిళలు తీర్చిదిద్దే ఉత్పత్తులకు స్వయం ఏపీ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మహిళా సాధికారత కోసం తాము అమలు చేసే విధానాల్లో WIPO భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో WIPO ప్రతినిధుల, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:We are supporting startup companies through the Ratan Tata Innovation Hub.